
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..
నేహల్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి
మనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు
నీరవ్ మోదీకి సంబంధించిన అక్రమ ఆస్తులను దాచడంలో, సాక్ష్యాలను నాశనం చేయడంలో నేహల్ పాత్ర ఉన్నట్లు భారత దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి
ఇంకా, నేహల్ మోదీపై అమెరికాలోని ప్రముఖ డైమండ్ కంపెనీ LLD డైమండ్స్‌ను దాదాపు రూ.19 కోట్ల మేర మోసం చేసిన కేసు కూడా నమోదైంది. తప్పుడు ఒప్పందాల ద్వారా డైమండ్లను తీసుకుని, వాటిని స్వప్రయోజనాల కోసం అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. నేహల్ అరెస్టుతో నీరవ్ మోదీ కేసులో పురోగతి సాధించినట్లేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.