జెట్‌ ఎయిర్‌వేస్‌కు హైకోర్టు నోటీసులు

Delhi HC Issues Notice to Jet Airways on Plea for Refund, Alternative Flights to Passengers - Sakshi

మరిన్ని ఇబ‍్బందుల్లో  జెట్‌ ఎయిర్‌వేస్‌

ప్రయాణికుల టికెట్‌ ధర రీఫండ్‌పై పిటిషన్‌

స్పందించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో పడిన విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. కాన్సిల్‌ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై జెట్‌ ఎయిర్‌వేస్‌ స్పందించాలని కోరింది. అలాగే ఈ అంశంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)ను ఆదేశించింది. 

ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేసి, ప్రయాణికులను సంక్షోభంలోకి నెట్టి వేసిందనంటూ సామాజిక కార్యకర్త బిజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.బి. భంభాని ఆధ్వర్యంలోని  హైకోర్టు బెంచ్‌ బుధవారం ఈ నోటీసులిచ్చింది.  ఈ వేసవి సెలవుల తర్వాత దీనిపై వాదనలను వింటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. 

కాగా జెట్ ఎయిర్‌వేస్‌ రుణ సమీకరణ అంశం ఒక కొలిక్కి రాకపోవడంతో సర్వీసులను ఆకస్మికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ చెల్లించాల్సిన రీఫండ్‌ మొత్తం సుమారు 360 కోట్ల రూపాయలకు పై మాటే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top