డిసెంబర్‌లో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

December GST Collections Drop to Rs 94726 Crore - Sakshi

రూ. 94,726 కోట్లకు పరిమితం

నవంబర్‌లో రూ. 97,637 కోట్లు... 

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు 2018 డిసెంబర్‌లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. డిసెంబర్‌లో వసూలైన రూ.94,726 కోట్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) పరిమాణం రూ.16,442 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) రూ.47,936 కోట్లు, సెస్సు రూ. 7,888 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 

9 నెలల్లో రూ.8.71 లక్షల కోట్లు.. 
2018–19 బడ్జెట్లో కేంద్రం వార్షికంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 1.12 లక్షల కోట్లు నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్‌–డిసెంబర్‌) పరిశీలిస్తే..  జీఎస్‌టీ వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్,      అక్టోబర్‌లో మాత్రమే ఇవి రూ.1 లక్ష కోట్లు దాటాయి. 

కొత్త రిటర్న్‌ ఫారంల నోటిఫికేషన్‌:
కాగా జీఎస్‌టీ విధానం కింద జూన్‌ 30 నాటికి వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన వార్షిక జీఎస్‌టీ రిటర్న్‌ కొత్త ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. మరోవైపు, 2017 జులై–2018 సెప్టెంబర్‌ మధ్య కాలానికి సంబంధించి జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయని వారిపై లేట్‌ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని సీబీఐసీ నిర్ణయించింది. అయితే, ఆయా సంస్థలు 2019 మార్చి 31 నాటికి మొత్తం 15 నెలల వ్యవధి రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top