ప్రభుత్వరంగ బ్యాంకులపై  నియంత్రణ పరిమితమే | Sakshi
Sakshi News home page

ప్రభుత్వరంగ బ్యాంకులపై  నియంత్రణ పరిమితమే

Published Thu, Mar 15 2018 12:30 AM

control over public sector banks is limited - Sakshi

గాంధినగర్‌ (గుజరాత్‌): ప్రభుత్వరంగ బ్యాంకులపై ఆర్‌బీఐకి అధికారాలు పరిమితమని కేంద్ర బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ స్పష్టం చేశారు. ప్రైవేటు బ్యాంకుల మాదిరే ప్రభుత్వరంగ బ్యాంకులపైనా పోలీసు మాదిరిగా వ్యవహరించే అధికారాలను ఇవ్వాలని కోరారు. ఇందుకు సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ‘‘ఈ రోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. బ్యాంకుల్లో మోసాలు, అవకతవకలపై రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా ఎంతో కోపంతో, బాధతో ఉంది. వ్యాపార సమూహంలో కొందరు రుణదాతలతో కుమ్మక్కు అయి చేసే ఈ విధమైన చర్యలు మన దేశ భవిష్యత్తును దోచుకోవడమే’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13,000 కోట్ల రూపాయిల నీరవ్‌మోదీ స్కామ్‌ బయటపడిన తర్వాత ఈ అంశంపై ఉర్జిత్‌ పటేల్‌ తొలిసారిగా గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. పీఎన్‌బీ స్కామ్‌పై స్పందిస్తూ... బ్యాంకుల్లో మోసాల నివారణకు గాను ఆర్‌బీఐ 2016 నుంచి మూడుసార్లు సర్క్యులర్లు జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికీ పీఎన్‌బీలో అక్రమాలను నివారించడంలో అంతర్గత వ్యవస్థ వైఫల్యం చెందిందని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో మొండి బకాయి (ఎన్‌పీఏ)లపైనా తక్షణమే ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ‘‘బ్యాంకు బ్యాలన్స్‌ షీట్ల లో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల ఎన్‌పీఏల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రమోటర్‌–బ్యాంకుల మధ్య ఉన్న రుణ బంధంలోనే వీటి మూలాలు ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టాలి’’ అన్నారు. నిబంధనల మేరకు వసూలు కాని రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించకపోవడంపై చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.    
 
అన్ని మోసాలను ముందే నివారించలేం: ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో ఎన్నో పరిమితులు ఉన్నాయని ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు. ‘‘డైరెక్టర్లను తొలగించలేం. యాజమాన్యాన్ని మార్చలేం. విలీనం లేదా దివాలా చర్యలు చేపట్టలేం. దేశంలో అన్ని బ్యాంకులు ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్నా యి. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకులను అధిక వాటా కలిగిన ప్రభుత్వం కూడా నియంత్రిస్తోంది. దీంతో బహుళ నియంత్రణ వ్యవస్థకు దారితీస్తోం ది’’ అంటూ ఉర్జిత్‌ పటేల్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో తమ కాళ్లకు బంధనాలున్నాయని స్పష్టం చేశారు. మోసాలు బయటపడిన తర్వాత ఆర్‌బీఐ వీటిని పట్టుకుని ఉండాల్సిందనే తరహా ప్రకటనలు వస్తుంటాయన్న ఆయన, ఏ బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ కూడా అన్ని మోసాలనూ ముందుగానే నివారించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.  

విషాన్ని మింగి  అమృతాన్ని సాధిస్తాం...  
నీలకంఠుడిలా కేంద్ర బ్యాంకు విషాన్ని మింగి, విమర్శలు ఎదుర్కొని అయినా వ్యవస్థను మరింత మెరుగ్గా మార్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తుందని ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌బీఐ ప్రయత్నాలను పురాణ కథనాలకు అన్వయించి ఆసక్తికరంగా చెప్పారు ‘‘మందర పర్వతంతో సముద్ర మథనం చేసినట్టుగా ఆర్‌బీఐ దేశ రుణ సంస్కృతిని పరిశుభ్రపరిచే ప్రయత్నాన్ని చేపట్టింది. ఈ మథనం పూర్తయ్యే వరకు, దేశ భవిష్యత్తు స్థిరంగా, సురక్షితంగా ఉండే అమృతం మాదిరి ఫలితం వెలుగుచూసే వరకు బయటకు వచ్చే విషాన్ని ఎవరో ఒకరు మింగాల్సిందే’’ అని ఉర్జిత్‌ పటేల్‌ వివరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement