పన్ను చెల్లింపుదారులకు ఊరట?

Central Government May Give Few Income Tax Exemptions - Sakshi

పన్ను చెల్లింపుదారులకు మరిన్ని రాయితీలు

సాక్షి,ముంబై: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపు దారులకు మరోసారి శుభవార్త అందించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక మందగమనంపై వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్‌  కీలక నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తోంది.  వినియోగదారుల డిమాండ్‌ను పెంచే ఉద్దేశంతో మరిన్ని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులకు పలు రాయితీలు ఇవ్వనున్నట్లు ఓ నివేదిక తెలిపింది.  తాజా నివేదిక ప్రకారం ప్రధాని మోదీ ప్రభుత్వం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ పరిమితులను మరింతగా పెంచే ప్రతిపాదనను తీసుకొస్తున్నట్లు తెలిపింది.

త్వరలో గృహ అద్దె చెల్లింపులు, బ్యాంక్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీలో మరిన్ని పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మరిన్ని విప్లవాత్మక చర్యలు ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా 1 మిలియన్ రూపాయల స్లాబ్‌ ప్రస్తుతం 30శాతంగా ఉంది.  ఈ ఏడాది స్థూల జీడీపీలో ద్రవ్య లోటును 3.3 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లక్ష్యంగా పెట్టుకున్నారని నివేదిక గుర్తు చేసింది. ఇటీవల ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గించడం వల్ల ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉపశమనం లభించిందని  తెలియజేసింది.  అయితే  ఈ అంశంపై ఆర్థికశాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. 

కాగా, వ్యక్తిగత పన్ను సంవత్సరానికి 2,50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 5 శాతం విధిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో టాప్ మార్జినల్ టాక్స్ రేటు 50 మిలియన్ రూపాయల ఆదాయానికి 42.74 శాతం విధిస్తున్నారు. కేపీఎమ్‌జీ డేటా ప్రకారం ఇది ఆసియా సగటు 29.99 శాతం కంటే ఎక్కువని నివేదిక తెలిపింది. కాగా, దేశ జనాభాలో కేవలం 5 శాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తారని  ప్రపంచ సగటు కంటే పన్ను, జీడీపీ నిష్పత్తి 11శాతం ర్యాంకులు తక్కువగా నమోదవడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top