బ్యాంకులకు మూలధనం జోష్‌!!

The Center will provide more capital to Public Sector Banks PSB - Sakshi

త్వరలో రూ. 83,000 కోట్ల నిధులు

దీంతో 2018–19లో రూ.1.06 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడి

న్యూఢిల్లీ: మొండిబాకీలు, నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం మరింత మూలధనం సమకూర్చనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న దానికి అదనంగా రూ.41,000 కోట్లు ఇవ్వనుంది. దీంతో పీఎస్‌బీలకు ఈ ఏడాది మొత్తం మీద రూ.1.06 లక్షల కోట్లు ఇచ్చినట్లవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ఈ విషయాలు తెలియజేశారు. వాస్తవానికి 2018–19లో పీఎస్‌బీలకు రూ. 65,000 కోట్లు అదనపు మూలధనం ఇవ్వాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో ఇప్పటిదాకా రూ. 23,000 కోట్లు సమకూర్చగా మరో రూ.42,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

అయితే, అదనంగా ఇవ్వబోయే రూ.41,000 కోట్లు కూడా దీనికి కలిపితే కొత్తగా రూ. 83,000 కోట్లు సమకూర్చినట్లవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో ఈ మొత్తాన్ని పీఎస్‌బీలకు అందించనున్నట్లు జైట్లీ చెప్పారు. పీఎస్‌బీల రుణ వితరణ సామర్థ్యం మెరుగుపడేందుకు, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బయటకు వచ్చేందుకు రీక్యాపిటలైజేషన్‌ తోడ్పడగలదని పేర్కొన్నారు. రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల జారీ ద్వారా రూ.41,000 కోట్లు బ్యాంకులకు సమకూర్చే ప్రతిపాదనకు సప్లిమెంటరీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ కింద పార్లమెంటు ఆమోదం కోరినట్లు జైట్లీ వివరించారు. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికకు ఇది అదనమని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులను గుర్తించే ప్రక్రియ పూర్తయిందని, మొండిబాకీలు క్రమంగా తగ్గుతున్నాయని అరుణ్‌ జైట్లీ వివరించారు.

‘ఇకపై ఇవ్వబోయే రూ.83,000 కోట్లతో పాటు మొత్తం రూ.1.06 లక్షల కోట్లను నాలుగు వేర్వేరు అంశాలుగా వినియోగించడం జరుగుతుంది. ముందుగా, నియంత్రణ నిబంధనలకు తగ్గ స్థాయిలో బ్యాంకులకు మూలధనం అందేలా చూస్తాం. కాస్త మెరుగుపడిన బ్యాంకులు సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో నుంచి బైటపడేందుకు కావాల్సిన స్థాయిలో అదనంగా నిధులు అందించడం రెండో అంశం. పీసీఏ అంచుల్లో ఉన్న బ్యాంకులు.. ఆ పరిధిలోకి వెళ్లకుండా అవసరమైన మూలధనాన్ని ముందుగానే సమకూర్చడమనేది మూడో అంశం. విలీనమయ్యే బ్యాంకులకు తగినంత స్థాయిలో మూలధనాన్ని అందించడం నాలుగో అంశం’ అని జైట్లీ పేర్కొన్నారు.  

మూడు బ్యాంకులు సేఫ్‌.. 
ప్రస్తుతం మూడు బ్యాంకులు పీసీఏ అంచున ఉన్నాయని, తాజాగా అదనపు మూలధనం లభిస్తే అవి గట్టెక్కుతాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం మొత్తం 21 పీఎస్‌బీల్లో 11 బ్యాంకులు పీసీఏ చర్యలు ఎదుర్కొంటున్నాయి. మొండిబాకీలు పేరుకుపోయి పీసీఏ పరిధిలోకి చేరిన పీఎస్‌బీల కార్యకలాపాలపై ఆంక్షలు వర్తిస్తాయి. అయితే, దేశీయంగా ఇందుకు సంబంధించిన నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆయా బ్యాంకులు పూర్తి స్థాయిలో కఠినతర నియంత్రణ నిబంధనలు అందుకోగలవని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అదనపు మూలధనం అందుకోబోయే బ్యాంకుల్లో.. నీరవ్‌ మోదీ స్కామ్‌ బాధిత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్, విజయా బ్యాంక్‌లకు నిధుల అవసరం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఎస్‌బీలు రూ. 60,726 కోట్ల మొండిబాకీలు వసూలు చేసుకోగలిగాయని, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది రెట్టింపని కుమార్‌ చెప్పారు.
 
రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. 
రెండేళ్ల వ్యవధిలో పీఎస్‌బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని 2017 అక్టోబర్‌లో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన కింద బడ్జెటరీ కేటాయింపుల ద్వారా రూ. 18,139 కోట్లు, రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల రూపంలో రూ. 1.35 లక్షల కోట్లు సమకూరుస్తోంది. ప్రభుత్వ వాటాలను విక్రయించడం ద్వారా బ్యాంకులు మరో రూ. 58,000 కోట్లు మార్కెట్ల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది. బాసెల్‌ త్రీ నిబంధనలను చేరేందుకు పీఎస్‌బీలు 2019 మార్చి నాటికి రూ. 58,000 కోట్లు మార్కెట్ల నుంచి సమకూర్చుకోగలవని కేంద్రం ముందుగా భావించింది. అయితే మార్కెట్లు అస్తవ్యస్తంగా మారడంతో బ్యాంకులు ఇప్పటిదాకా ఈ మార్గం ద్వారా రూ. 24,400 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగాయి. పైపెచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో బ్యాంకుల మొండిబాకీలు భారీగా ఎగిశాయి.

దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు ముందుగా నిర్దేశించుకున్న దానికన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మూలధనం సమకూర్చేందుకు ప్రభుత్వమే సిద్ధమైంది.  రూ. 85,948.86 కోట్ల అదనపు వ్యయాలకు ఆమోదం కోరుతూ సప్లిమెంటరీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ 2018–19 రెండో విడత ప్రతిపాదనలను కేంద్రం గురువారం పార్లమెంటు ముందుంచింది. ఇందులో సగభాగం పీఎస్‌బీలకు అదనపు మూలధనం కింద పోనుంది. నగదు రూపంలో వ్యయాలు నికరంగా రూ. 15,065.49 కోట్లు ఉండనున్నాయి.  

ఎయిరిండియాకు రూ. 2,345 కోట్లు.. 
ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం మరిన్ని నిధులు అందించనుంది. ఎయిరిండియాకు ఈక్విటీ రూపంలో రూ. 2,345 కోట్లు, ఎయిరిండియా అసెట్‌ హోల్డింగ్‌కు మరో రూ. 1,300 కోట్లు సమకూర్చనుంది. ప్రస్తుతం ఎయిరిండియా రుణభారం దాదాపు రూ. 55,000 కోట్ల మేర ఉంది.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top