అడ్డూఅదుపూ లేని ఎన్‌పీఏలు!

Care Ratings Report on npa's - Sakshi

ఏడాదిలో ఏకంగా 50 శాతం పెరుగుదల

మొత్తం ఎన్‌పీఏలు ప్రస్తుతం 7.31 లక్షల కోట్లు

ఆరునెలల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో పెరిగింది 2.1 లక్షల కోట్లు!  

న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల్లో మొండి బకాయిల వాటా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఒక్క ఏడాదిలోనే 26 బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు ఏకంగా 50 శాతం పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. 26 బ్యాంకుల ఉమ్మడి స్థూల మొండి బకాయిలు 2017–18లో ఏకంగా రూ.7.31 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం గణాంకాలతో పోల్చి చూస్తే 50 శాతం పెరిగినట్లు లెక్క. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు.

ఒక్క పీఎస్‌యూ బ్యాంకుల నుంచి డిసెంబర్‌ త్రైమాసిక కాలంలోనే రూ.లక్ష కోట్ల ఎన్‌పీఏలు జత కాగా, మార్చి త్రైమాసికంలో మరో రూ.1.1 లక్షల కోట్ల మేర పెరిగాయని కేర్‌ రేటింగ్స్‌ నివేదిక తెలియజేసింది. మొత్తం ఎన్‌పీఏల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా సుమారు రూ.6.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే 26 బ్యాంకుల ఎన్‌పీఏలు నికరంగా రూ.2.5 లక్షల కోట్ల మేర పెరిగినట్టు తెలుస్తోంది.

గత ఏడాది జూన్‌ క్వార్టర్లో స్థూల ఎన్‌పీఏల శాతం 9.04గా ఉంటే, అది సెప్టెంబర్‌ క్వార్టర్లో 8.93 శాతానికి తగ్గింది. పోనీలే పరిస్థితి కాస్త మెరుగుపడుతోందని అనుకుంటే... మార్చి త్రైమాసికం నాటికి ఇది ఏకంగా 10.14 శాతానికి పెరిగిపోయింది. అంటే... బ్యాంకులిస్తున్న ప్రతి 100 రూపాయల అప్పులో రూ.10కిపైనే మొండి బాకీగా మారపోతోందన్న మాట.

ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 13.41 శాతానికి చేరాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏల రేషియో 2017 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 11–12 శాతం మధ్యనే ఉండగా... ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 1.63 శాతం పెరిగి 13.41 శాతానికి చేరింది.

ప్రైవేటు బ్యాంకుల్లోనూ...
మార్చి త్రైమాసికంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ ఎన్‌పీఏలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డిసెంబర్‌ క్వార్టర్లో ఇవి మోస్తరుగానే ఉన్నాయి. మార్చి చివరికి ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.18,000 కోట్ల ఎన్‌పీఏల పెరుగుదలను చూపించాయి.

అదే డిసెంబర్‌ త్రైమాసికంలో పెరిగిన ఎన్‌పీఏలు కేవలం రూ.1,200 కోట్లే. ఇక 2017–18లో ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులు అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.43,611 కోట్ల నుంచి రూ.1,05,150 కోట్లకు పెరిగాయని కేర్‌ రేటింగ్స్‌ నివేదిక తెలియజేస్తోంది.

పది ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్‌పీఏల రేషియో 10 శాతం పైన ఉంటే, ఐదు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్‌పీఏల రేషియో మొత్తం రుణాల్లో 2–5 శాతంగా ఉంది. మరో ఐదు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 2 శాతంలోపు ఉన్నాయి. ఇతర బ్యాంకుల ఫలితాలు రావాల్సిఉంది.

ఎన్‌పీఏల పరిస్థితి ఇదీ...
రూ.7.31 లక్షల కోట్లు (26 బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు)
రూ.2.5 లక్షల కోట్లు (గడిచిన ఏడాదిలో 26 బ్యాంకుల్లో పెరిగిన ఎన్‌పీఏలు)
రూ.18,000 కోట్లు (మార్చి క్వార్టర్లో ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగిన నికర ఎన్‌పీఏలు)
 రూ.1,05,150 కోట్లు (2017–18లో ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top