ఇతర ఆదాయాలతో జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

ఇతర ఆదాయాలతో జాగ్రత్త!

Published Mon, Oct 24 2016 1:28 AM

ఇతర ఆదాయాలతో జాగ్రత్త! - Sakshi

డివిడెండ్లుగుర్రపు పందేలు/లాటరీ మీది ఆదాయం
వడ్డీ బహుమతులు ఇంటి మినహా
ఇతరమార్గాల్లో వచ్చే అద్దె ఆదాయం నాలుగు రకాలు.

 ఇదేంటనుకుంటున్నారా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మనం సంపాదించే డబ్బుని నాలుగు రకాల ఆదాయాలుగా విభజిస్తారు. అవే.. జీతం, ఇంటి మీద ఆదాయం, వృత్తి/వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు. ఇవి కాక మనం చాలా మార్గాల్లో డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాం. అప్పుడు ఆ సంపాదనను ఇతర ఆదాయాల కింద పేర్కొంటాం. అవేంటో ఒకసారి చూద్దాం..

 ఈ మార్గాల్లో వచ్చే డబ్బుని ఇతర ఆదాయంగా పరిగణిస్తాం. డివిడెండ్ల మీద వచ్చే ఆదాయానికి పూర్తిగా మినహాయింపు ఉంది. కుటుంబ పెన్షన్ విషయంలో కొంత మినహాయింపు పొందొచ్చు. ఫర్నీచర్ అద్దెకిస్తే వచ్చే ఆదాయంలోంచి వాటి మీది తరుగుదల మినహాయిస్తారు. బహుమతుల మీద పరిమితులు ఉన్నాయి. సంవత్సర కాలంలో రూ.50,000 లోపు బహుమతులకు పన్ను భారం లేదు. పెళ్లి కానుకలకు మినహాయింపు ఉంది. వీలునామా ద్వారా సంక్రమించే ఆస్తులకు పన్ను లేదు. రక్తసంబంధీకులిచ్చిన బహుమతులకు కూడా పన్నుభారం ఉండదు.

ఈ బహుమతుల స్టోరీ చదవండి..
సుబ్బారావు, పార్వతమ్మ ఒకేసారి స్వర్గస్తుల య్యారు. సుబ్బారావు రాసిన వీలునామా ప్రకారం.. కొడుకు సత్యానికి ఒక భవంతి సంక్రమించింది. దీనికి పన్ను లేదు. తల్లి నుంచి పెద్ద కూతురు అన్నపూర్ణకి వంద తులాలు బం గారం, చిన్నకూతురు కృష్ణవేణికి రూ.5,00,000ల నగదు వచ్చింది. ఇద్దరికీ పన్ను భారం ఉండదు. స్వంత వ్యాపారం కోసం సత్యానికి ఆయన మామ, అత్త, మేనత్త, మేనమామ తలా రెండు లక్షల చొప్పున ఇచ్చారు. దీనికీ పన్ను భారం లేదు. అలాగే సత్యానికి తన చిన్నప్పటి స్నేహితుడు ప్రసాద్ రూ.2,00,000లు బహుమతిగా ఇచ్చాడు. దీన్ని మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు.

 సత్యం వ్యాపారం ‘మూడు పూలు.. ఆరు కాయలు’ లాగా అభివృద్ధి చెందింది. విపరీతమైన లాభాలు వచ్చాయి. ఈయనకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి లావ ణ్య పెళ్లి ఘనంగా చేశాడు. పెళ్లికి నగదు, ఆభరణాలు కానుకగా వచ్చాయి. దీని మీద పన్ను భారం లావణ్యకి లేదు. లావణ్యకు ఆమె మామ పెద్ద ఫ్లాటు రాసిచ్చారు. దీనికీ పన్ను భారం లేదు. అలాగే సత్యం కొడుకు చైతన్య, చిన్న కూతురు అరుణ ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. చైతన్య అక్క లావణ్యకి ఎన్నో సార్లు అక్కడి నుంచి డబ్బు బదిలీ చేశాడు.

దీనికి సంబంధించి లావణ్యకి పన్ను భారం లేదు. అలాగే లావణ్య కూడా అరుణకి కొన్ని బహుమతులు పంపించేది. ఇక్కడ ఇరువురికీ పన్ను భారం లేదు. అంటే రక్తసంబంధీకులు ఇచ్చిపుచ్చుకునే వాటికి పన్ను భారం ఉండదు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాత నిజంగా ఉండాలి. అతనికి ఇచ్చే సామర్థ్యముండాలి. అన్ని కల్పితాలైతే మాత్రం బహుమతులన్నీ ఆదాయం కిందకు వచ్చేస్తాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement