వ్యాపారాలపై ధీమా తగ్గింది

Business confidence at sharpest moderation since global financial crisis - Sakshi

ప్రభుత్వం సహాయక ప్యాకేజీ ఇవ్వాలి

ఆర్‌బీఐ రెపో రేటు

మరో 1 శాతం తగ్గించాలి

ఫిక్కీ సర్వేలో కార్పొరేట్ల అభిప్రాయం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకి వ్యాపారాలపై కార్పొరేట్ల ధీమా సన్నగిల్లింది. 2008–09 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్య స్థాయికి పడిపోయింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థాయికి తిరిగొచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వ్యాపారాలకు సహాయక ప్యాకేజీలు ఇవ్వాలని ఫిక్కీ పేర్కొంది. అలాగే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ మరో 100 బేసిస్‌ పాయింట్లు (1 శాతం) తగ్గించాలని కోరింది. కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసే దిశగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో భారత్‌ సహా పలు దేశాల వృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాపారవర్గాలపై ఫిక్కీ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.

‘వ్యాపార విశ్వాస సూచీ ప్రస్తుతం 42.9 పాయింట్లుగా ఉంది. గత సర్వేలో ఇది 59.0గా నమోదైంది‘ అని ఫిక్కీ పేర్కొంది. గతంలో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు 2008–09 రెండో త్రైమాసికంలో ఈ సూచీ అత్యంత కనిష్టమైన 37.8 స్థాయికి పడిపోయినట్లు వివరించింది. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ అవకాశాలపై వ్యాపార వర్గాల్లో ధీమా సడలటాన్ని ఇండెక్స్‌ సూచిస్తోందని తెలిపింది. వివిధ రంగాలకు చెందిన సుమారు 190 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటి టర్నోవరు రూ. 1 కోటి నుంచి రూ. 98,800 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంపై వ్యాపార వర్గాల అంచనాలను దీని ద్వారా సేకరించారు.

సబ్సిడీలు.. ట్యాక్స్‌ హాలిడేలు కావాలి..
డిమాండ్, సరఫరా, నిధుల కొరత రూపంలో దేశ ఎకానమీ ప్రధానంగా మూడు సమస్యలు ఎదుర్కొంటోందని ఫిక్కీ తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమకు.. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు గట్టెక్కడానికి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. సబ్సిడీలు, విధానపరమైన మద్దతు, ట్యాక్స్‌ హాలిడేలు, కరోనా పూర్వ స్థాయిల్లో ఉద్యోగాలను కొనసాగించేందుకు ప్రత్యేకంగా నిధులపరమైన తోడ్పాటులాంటివి అందించాలని విజ్ఞప్తి చేసింది. కార్మిక మార్కెట్‌ సంస్కరణలను తక్షణమే ప్రాధాన్యత అంశంగా పరిశీలించాలని కోరింది. అలాగే, నేరుగా రిజర్వ్‌ బ్యాంక్‌ నేరుగా కార్పొరేట్‌ బాండ్ల కొనుగోలు చేపట్టాలని, రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో అత్యధికంగా 72 శాతం కంపెనీలు.. కరోనావైరస్‌ వ్యాప్తి తమ వ్యాపారాలను దెబ్బతీసిందని వెల్లడించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top