18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,041 ఎంఎస్‌ఎంఈలు మూత
ఉపాధి కోల్పోయిన 39,327 మంది
ప్రస్తుత పరిస్థితితో పోలిస్తే కరోనా సమయంలో మూతపడినవి బహు తక్కువ
నాలుగేళ్లతో పోలిస్తే 7 రెట్లు ఉపాధిని దెబ్బతీసిన ఎంఎస్‌ఎంఈ రంగం
కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ వెల్లడి
రాయితీల కోసం ఇప్పటికే రోడ్డెక్కిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
ఇంటికో పారిశ్రామికవేత్త కాదు.. ఇంటికో భిక్షగాడు తయారవుతున్నాడంటున్న ఎంఎస్‌ఎంఈ సంఘాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లు తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. బడా బాబులకు రాయితీల జల్లులు కురిపిస్తున్న చంద్రబాబు సర్కారు అత్యధికమంది ఆధారపడిన ఎంఎస్‌ఎంఈ రంగాన్ని గాలికి వదిలేయడంతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయాయి.
తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు ఇవ్వడానికి దిక్కులేదు కానీ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పడంపై ఎంఎస్‌ఎంఈల యజమానులు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గడచిన 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో 3,041 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడినట్టు కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ స్వయంగా రాజ్యసభకు తెలియచేశారు.
ఈ యూనిట్లు మూత పడటం ద్వారా 39,327 మంది ఉపాధి కోల్లోయినట్లు తెలిపారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో మూతపడిన యూనిట్లలో ఏపీ వాటా 3.73 శాతం ఉండగా.. 7.44 శాతం మంది ఉపాధి కోల్పోయారు.
కోవిడ్ కాలంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు
రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉపాధి కోల్పోవడం ఇదే ప్రథమం అని అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో యూనిట్లు మూతపడలేదన్న విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా తర్వాత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో 873 యూనిట్లు మూతపడటంతో 5,075 మంది ఉపాధి కోల్పోయారు. అంటే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఈ 18 నెలల కాలంలోనే ఏకంగా 774 శాతం అధికంగా 39,327 మంది ఉపాధి కోల్పోవడం రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల దుస్థితికి అద్దం పడుతోంది.
విద్యుత్ బిల్లుల షాక్
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్‌ఎంఈలకు భారీగా షాకిచి్చంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్‌ఎంఈలపై విద్యుత్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్‌ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ.13.55 చేస్తుండగా.. తమిళనాడులో సగటున యూనిట్ ధర రూ.7–8గా ఉంది. అంటే యూనిట్‌కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటి కారణాలు ఎంఎస్‌ఎంఈలు మూతపడేలా చేస్తున్నాయి. ఇంకోపక్క ఎంఎస్‌ఎంఈలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడం వంటివి ఎంఎస్‌ఎంఈ యూనిట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే విధంగా చేస్తున్నాయి.
ఇలాగైతే ఇంటికో భిక్షగాడు
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్నామంటూ గల్లీ నుంచి అమెరికా వరకు ప్రతీ వేదికపైనా సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయి. మాకివ్వాల్సిన ప్రోత్సాహకాలనిచ్చి ఆందుకోండి మహాప్రభో అని ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు 4 నెలలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదు.
కేవలం ఎంఎస్‌ఎంఈలకు రూ.1,900 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. విశాఖ పెట్టుబడుల సమావేశం ముందు కేవలం రూ.438 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. ఇందులో కూడా అత్యధిక శాతం కియా, పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌కు చెందిన కంపెనీలకే చెల్లించడం పట్ల దళిత పారిశ్రామికవేత్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ సమయంలో వైఎస్ జగన్ సర్కారు కులం, మతం, పార్టీ చూడకుండా ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం నిబంధనలను లుఉల్లంఘిస్తూ కేవలం ఆ పార్టీ మద్దతుదారులకు మాత్రమే ప్రోత్సాహకాలను విడుదల చేస్తోందని దళిత పారిశ్రామికవేత్తల జేఏసీ ఆరోపిస్తోంది. ఈ విధంగా చేస్తే రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏమొస్తాయని నిలదీస్తున్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టు ఇంటికో పారిశ్రామికవేత్త సంగతి దేవుడెరుగు.. ఇంటికో భిక్షగాడు తయారవుతారంటూ ఎద్దేవా చేస్తున్నారు.


