బ్యాంకులపై ‘బకాయిల’ బండ | Bank of Baroda Q4 net loss at Rs 3230cr, provision at Rs 6858cr | Sakshi
Sakshi News home page

బ్యాంకులపై ‘బకాయిల’ బండ

Published Sat, May 14 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

బ్యాంకులపై ‘బకాయిల’ బండ

బ్యాంకులపై ‘బకాయిల’ బండ

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మొండి బకాయిలు మోయలేని భారం మోపుతున్నాయి.

ఎన్‌పీఏలకు భారీ కేటాయింపులతో కుదేల్..
బ్యాంక్ ఆఫ్ బరోడాకు రెండో సారీ భారీ నష్టం
అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులదీ ఇదే పరిస్థితి...

చెన్నై/కోల్‌కత: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మొండి బకాయిలు మోయలేని భారం మోపుతున్నాయి. మొండి బకాయి(ఎన్‌పీఏ)లకు కేటాయింపులు అంతకంతకు పెరిగిపోతుండటంతో బ్యాంక్‌లకు భారీగా నష్టాలు వస్తున్నాయి. శుక్రవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఆరు బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు నష్టాలనే ప్రకటించాయి. మొండి బకాయిల కేటాయింపులు భారీగా ఉండటంతో ఈ బ్యాంక్‌లు లాభదాయకత దారుణంగా దెబ్బతిన్నది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్  బ్యాంక్ ఆఫ్ ఇండియా,  యూకో బ్యాంక్, దేనా బ్యాంక్‌లు నికర నష్టాలు ప్రకటించగా, ఒక్క యూనియన్ బ్యాంక్‌కు  మాత్రం నికర లాభాలు వచ్చాయి. ఈ ఐదు బ్యాంకుల నష్టాలు..  గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,751 కోట్లకు చేరాయి. నష్టాలు ప్రకటించడంతో ఈ బ్యాంక్ షేర్లు కూడా భారీగా క్షీణించాయి. వివరాలు..

 బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం రూ.3,230 కోట్లు...
మొండి బకాయిలకు భారీ కేటాయింపులతో బ్యాంక్ ఆఫ్ బరోడా కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.3,230 కోట్ల నికర నష్టం వచ్చింది. భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద త్రైమాసిక నష్టం. ఈ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,342 కోట్ల నికర నష్టం పొందింది. భారత బ్యాంకింగ్ చరిత్రలో  అత్యంత పెద్ద త్రైమాసిక నష్టం ఇదే. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,057 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,789 కోట్లకు పెరిగింది. కేటాయింపులు రూ.1,817 కోట్ల నుంచి రూ.6,857 కోట్లకు పెరిగాయి.

స్థూల మొండి బకాయిలు 3.72 శాతం నుంచి 9.99 శాతానికి పెరిగాయి.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సర పరంగా చూస్తే.., గత ఆర్థిక సంతవ్సరానికి రూ.5,386 కోట్ల నికర నష్టం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంతవ్సరంలో ఈ బ్యాంక్ రూ.3,398 కోట్ల నికర లాభం సాధించింది.  మొత్తం ఆదాయం రూ.47,366 కోట్ల నుంచి రూ.49,060 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు రూ.16,261  కోట్ల నుంచి రూ.40,521 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.8,969 కోట్ల నుంచి రూ.19,406 కోట్లకు ఎగిశాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 1.7 శాతం క్షీణించి రూ.155 వద్ద ముగిసింది.

 అలహాబాద్ బ్యాంక్
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.581 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ఈ బ్యాంక్ రూ.203 కోట్ల నికర లాభం ఆర్జించింది. కేటాయింపులు రూ.631 కోట్ల నుంచి నాలుగింతలై రూ.2,487 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.5,391 కోటల నుంచి రూ.5,051 కోట్లకు తగ్గింది. ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే,  2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.621 కోట్ల నికర లాభం రాగా,  గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.743 కోట్ల నికర నష్టం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.21,712 కోట్ల నుంచి రూ.20,795 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో అలహాబాద్ బ్యాంక్  షేర్ 1.6 శాతం క్షీణించి రూ.53 వద్ద ముగిసింది.

 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఈ బ్యాంక్‌కు రూ.898 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.617 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4 రెట్లు పెరిగి రూ.2,287 కోట్లకు చేరాయి. స్థూల ఎన్‌పీఏలు 6.09% నుంచి 11.95%కి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్  షేర్ 0.8% క్షీణించి రూ.78 వద్ద ముగిసింది.

 యూనియన్ బ్యాంకు లాభం రూ.96 కోట్లు
యూనియన్ బ్యాంక్(యూబీఐ)కు మాత్రం లాభాలు వచ్చాయి. 2014-15 ఏడాది క్యూ4లో రూ.444 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 78% తగ్గి రూ.96 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 4.96 శాతం నుంచి 8.7 శాతానికి, నికర మొండి బకాయిలు 2.71% నుంచి 5.25%కి  పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.9,384 కోట్ల నుంచి రూ.8,885 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంక్ రూ.1,352 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే అంతక్రితం ఏడాది లాభం(రూ.1,782 కోట్లు)తో పోల్చితే  తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ.35,607 కోట్ల నుంచి రూ.35,831 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  షేర్ 1.8 శాతం క్షీణించి రూ.116 వద్ద ముగిసింది.

15.43 శాతానికి యూకో బ్యాంక్ ఎన్‌పీఏలు
ఎన్‌పీఏలు భారీగా పెరగడంతో యూకో బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,715 కోట్ల నికర నష్టం వచ్చింది.  2014-15లో ఇదే క్వార్టర్‌కు బ్యాంక్ రూ.209 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం రూ.రూ.5,263 కోట్ల నుంచి రూ.4,745 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు  రూ.968 కోట్ల  నుంచి 142 శాతం వృద్ధితో రూ.2,345 కోట్లకు పెరిగాయని బ్యాంక్ తెలిపింది.  స్థూల ఎన్‌పీఏలు 6.76 శాతం నుంచి 15.43 శాతానికి,  నికర మొండి బకాయిలు 4.3 శాతం నుంచి 9.09 శాతానికి ఎగిశాయని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో యూకో బ్యాంక్  షేర్ 5.9  శాతం క్షీణించి రూ.34 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement