యాక్సిస్‌ బ్యాంక్‌ షాక్‌!

Axis Bank posts first-ever quarterly loss at Rs 2188 crore, provisions - Sakshi

క్యూ4లో అనూహ్యంగా రూ. 2,189 కోట్ల నికర నష్టం

బ్యాంక్‌ లిస్టింగ్‌ తర్వాత తొలిసారిగా త్రైమాసిక నష్టాలు...

మొండిబకాయిలు భారీగా ఎగబాకడమే కారణం...

మూడు రెట్లు పెరిగిన ప్రొవిజనింగ్‌

ఈసారి వాటాదారులకు డివిడెండ్‌ కూడా నిల్‌...  

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్‌ రంగానికి మొండిబకాయిలు(ఎన్‌పీఏ) తూట్లు పొడుస్తున్నాయి. ప్రైవేటు రంగంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్‌.. యాక్సిస్‌ బ్యాంకుకు ఈ సెగ గట్టిగానే తగిలింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో బ్యాంక్‌ అనూహ్యంగా రూ.2,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ రూ.1,225 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 1998లో యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తర్వాత, అంటే రెండు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా త్రైమాసిక నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రధానంగా మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడంతో, వాటికి కేటాయింపులు(ప్రొవిజనింగ్‌) ఎగబాకడమే ఈ నష్టాలకు కారణంగా నిలిచింది. క్యూ4లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్ల నుంచి రూ.14,560 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) ఎలాంటి పెరుగుదల లేకుండా రూ.4,730 కోట్లుగా నమోదైంది. మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. 

అంచనాలు తలకిందులు... 
విశ్లేషకులు క్యూ4లో బ్యాంక్‌ నికర లాభం 56 శాతం దిగజారి రూ.534 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, అసలు లాభం లేకపోగా భారీ నష్టాన్ని ప్రకటించడంతో మార్కెట్‌ వర్గాలు ఖంగుతిన్నాయి. గురువారం మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిశాక ఫలితాలను ప్రకటించారు. బీఎస్‌ఈలో షేరు ధర రూ.0.77 శాతం నష్టంతో రూ.495 వద్ద ముగిసింది. అత్యంత దుర్భర ఫలితాల నేపథ్యంలో నేడు(శుక్రవారం) షేరుపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 

పూర్తి ఏడాది లాభం 92.5 శాతం డౌన్‌... 
గడిచిన 2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా బ్యాంక్‌ అత్యంత ఘోరమైన పనితీరును నమోదుచేసింది. నికర లాభం కేవలం 
రూ.276 కోట్లకు పరిమితమైంది. 2016–17లో లాభం రూ.3,679 కోట్లతో పోలిస్తే ఏకంగా 92.5 శాతం పడిపోయింది. ఇక బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా ఏమాత్రం పెరగలేదు. దాదాపు అదేస్థాయిలో రూ.56,233 కోట్ల నుంచి రూ.56,747 కోట్లకు చేరింది. 

ఎన్‌పీఏల బండ... 
మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 6.77 శాతానికి(విలువ రూ.34,248 కోట్లు) పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇవి 5.04 శాతం(రూ.21,280 కోట్లు) మాత్రమే. సీక్వెన్షియల్‌గా చూసినా స్థూల ఎన్‌పీఏలు భారీగానే పెరిగాయి. గతేడాది క్యూ3లో ఇవి 5.28 కోట్లు(రూ.25,000 కోట్లు)గా ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు 2.11 శాతం(రూ. 8,627 కోట్లు) నుంచి 3.4 శాతానికి (రూ.16,592 కోట్లు) ఎగిశాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే... గతేడాది క్యూ3లో 2.56 శాతం(రూ.11,770 కోట్లు)గా నమోదయ్యాయి. ఎన్‌పీఏలు భారీగా పెరగడంతో వీటికి కేటాయింపులు(ప్రొవిజనింగ్‌) క్యూ4లో రూ.7,180 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది క్యూ4లో ప్రొవిజనింగ్‌ రూ.2,581 కోట్లతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం. క్యూ4లో దాదాపు రూ.16,536 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారిపోయాయి. ఇందులో రూ.13,900 కోట్లు కార్పొరేట్‌ కంపెనీల నుంచే ఉన్నాయి. విద్యుత్‌ రంగానికి తాము ఇచ్చిన రుణాలు రూ.9,000 కోట్లు కాగా, వీటిలో 40 శాతం ఎన్‌పీఏలుగా మారాయని బ్యాంక్‌ పేర్కొంది. 

డివిడెండ్‌ మిస్‌... 
లాభాలు కరువై.. నష్టాల్లోకి జారిపోవడంతో వాటాదారులకు బ్యాంక్‌ మొండిచెయ్యి చూపింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2017–18) సంబంధించి యాక్సిస్‌ డైరెక్టర్ల బోర్డు ఎలాంటి డివిడెండ్‌ను ప్రకటించలేదు. గడిచిన పదేళ్లలో బ్యాంక్‌ డివిడెండ్‌ను ఇవ్వకపోవడం ఇదే తొలిసారి కావడం దుర్భర పనితీరుకు నిదర్శనం. 2016–17 ఏడాదికిగాను రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున డివిడెండ్‌ ఇచ్చారు.

కఠిన నిబంధనల ప్రభావం: శిఖా శర్మ
ఇటీవలి కాలంలో మొండిబాకాయిల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) విధించిన కఠిన నిబంధనలు కూడా తమ ఎన్‌పీఏలు ఎగబాకడానికి ఒక కారణమని బ్యాంక్‌ సీఈఓ, ఎండీ శిఖా శర్మ ఫలితాల సందర్భంగా విలేకరులకు చెప్పారు. ఈ ప్రభావంతో కొన్ని ఖాతాలను ఎన్‌పీఏలుగా పరిగణించాల్సివచ్చిందన్నారు. ‘రుణ సంబంధ రిస్కులు బ్యాంకును తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్రా రంగం చాలా కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ రిస్కులను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రధానంగా దృష్టిపెడుతున్నాం. ఎన్‌పీఏల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం ఇప్పుడు మా ప్రధాన కర్తవ్యం. అయితే, ఈ ప్రక్రియ దాదాపు చివరిదశకు వచ్చినట్టేనని భావిస్తున్నాం’ అని ఆమె వివరించారు. మొండిబకాయిల సమస్యతో బ్యాంక్‌ పనితీరు బాగోలేదని, శిశా శర్మ పదవీ కాలం పొడిగింపుపై పునరాలోచించాలంటూ ఆర్‌బీఐ యాక్సిస్‌ బోర్డుకు సూచించడం తెలిసిందే. ఈ కారణంగా మూడేళ్ల పదవీకాలాన్ని శిఖా శర్మ స్వచ్ఛందంగా ఈ ఏడాది డిసెంబర్‌కు(ఏడు నెలలకు) కుదించుకోవాల్సి వచ్చింది. కాగా, తదుపరి బ్యాంక్‌ చీఫ్‌గా సరైన వ్యక్తిని నియమించడంలో బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని, ఇందుకు తన పూర్తి సహకారం అందిస్తానని శిఖా శర్మ వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top