‘కుబేర’ తరహాలో టీడీపీ నేతల భారీ స్కామ్‌ | A Huge Scam By TDP Leaders In Nellore, Watch Video For More Details Inside | Sakshi
Sakshi News home page

‘కుబేర’ తరహాలో టీడీపీ నేతల భారీ స్కామ్‌

Jul 21 2025 5:40 AM | Updated on Jul 21 2025 4:12 PM

A huge scam by TDP leaders in nellore

బాధితులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తరహాలో జీతాలు చెల్లించినట్టుగా బ్యాంక్‌ లావాదేవీలు

గిరిజనుల్ని మోసగించి రూ.10.60 కోట్లను బొక్కేసిన కేటుగాళ్లు 

56 మంది గిరిజనులను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపి బ్యాంక్‌ నుంచి రుణాలు 

నెల్లూరులో వెలుగులోకి వచ్చిన కుంభకోణం 

నిందితుల్లో టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన జర్నలిస్ట్‌ 

అసలు పాత్రధారులెవరో బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు  

యాక్సిస్‌ బ్యాంక్‌ అధికారుల పాత్రపైనా అనుమానాలు 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  కొందరు టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్టు కలిసి గిరిజనులను అడ్డం పెట్టుకుని ప్రైవేటు బ్యాంకు నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకుని మోసగించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదలైన కుబేర సినిమాను తలపించే రీతిలో ఈ భారీ స్కామ్‌ జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన 56 మంది గిరిజనుల పేరిట రూ.10.60 కోట్లను టీడీపీ నేతలు కాజేసినట్టు వెలుగులోకి రాగా.. ఈ మొత్తం దాదాపు రూ.20 కోట్లపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నెల్లూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో బ్యాంక్‌ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గిరిజనుల్ని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపి.. 
యాక్సిస్‌ బ్యాంక్‌కు నెల్లూరు, ముత్తుకూరులో బ్రాంచ్‌లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వారిని, కూలి పనులు చేసుకునే వారిని, పశువుల కాపరులను టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్టు జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్, తదితరులు కలిసి బ్యాంక్‌ రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు. వారి నుంచి ఆధార్‌ కార్డులు, ఫొటోలు తీసుకుని బ్యాంక్‌లో ఖాతాలు తెరిపించారు. ఇలా 100 మంది నిరక్షరాస్యులు, అమాయకుల రికార్డులు సేకరించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు నెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఎంఆర్‌ ఇన్‌ఫ్రా లైన్, గ్లోబల్‌ సొల్యుషన్, క్యాపిటల్‌ ట్రీ సాఫ్ట్‌వేర్‌ పేర్లతో నకిలీ కంపెనీలను సృష్టించారు. కూలీలను, పశువుల కాపరులను ఆ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపించారు. వీళ్లంతా గిరిజనులే. ఒక్కొక్కరికి రూ.75 వేల నుంచి రూ.లక్షకు పైగా జీతాలు ఇస్తున్నట్లు రికార్డులు, పే స్లిప్పులు తయారు చేశారు. వారందరికీ 6 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు కూడా సృష్టించారు. వీటిని యాక్సిస్‌ బ్యాంక్‌కు సమర్పించి ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల చొప్పున బ్యాంక్‌ నుంచి రుణం పొందారు. 

ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్‌ సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుడితోను నేరుగా మాట్లాడడం, కలవడం, రికార్డులు పరిశీలించడం వంటివేమీ లేకుండానే రుణాలిచ్చేశారు. ఈ విషయాలేవీ లబ్దిదారులకు తెలియకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. 4 నెలల పాటు బ్యాంక్‌ వాయిదాలు చెల్లించిన నకిలీ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేశాయి. రుణం వస్తుందని ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు అందడంతో వారు దిగ్బ్రాంతి కి గురయ్యారు.  

8 నెలల క్రితమే ఫిర్యాదు అందినా.. 
ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మదన్‌మోహన్‌రావు 2024 డిసెంబర్‌ 12న ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ బ్యాంక్‌లో 56 మంది పేరిట రూ.10.60 కోట్లు రుణాలు పొందినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 

బ్యాంక్‌ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై బ్యాంక్‌ ఇంతవరకు విచారణ జరపలేదు. 56 మంది పేరిట రూ.10.60 కోట్ల రుణం కాజేసినట్టు ప్రాథమికంగా బయటకు వచ్చినా.. నిందితులు 100 మంది పేరిట రూ.20 కోట్లకు పైగా కాజేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అసలు పాత్రధారులెవరో బయటకు పొక్కనివ్వకుండా టీడీపీ పెద్దలు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. 

మీడియా ముందుకొచ్చిన బాధితులు 
మోసపోయిన బాధిత గిరిజనులు ఆదివారం మీడియా ముందుకొచ్చారు. సుమారు 60 మంది తమకు జరిగిన మోసాన్ని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, జిల్లా సంఘం చైర్మన్‌ రాపూరు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర, మహిళ అధ్యక్షురాలు చెంబేటి ఉషతో కలిసి మీడియాకు వివరించారు.  

పైసా కూడా తీసుకోలేదు 
నాకు బ్యాంకుల సంగతి తెలియదు. ఇప్పుడు లోన్‌ కట్టాలని బ్యాంకు వాళ్లు చెన్నై నుంచి లాయర్‌ నోటీసులు పంపించారు. కొన్ని నెలల కిందట కొందరు వ్యక్తులు మాకు రుణాలు ఇప్పి­స్తామని ఆధార్‌ కార్డులు తీసుకున్నారు. కానీ, ఏమైందో తెలియదు. ఏనాడూ బ్యాంక్‌కు వెళ్లలేదు. ఇప్పుడు రూ.15 లక్షలు రుణం తీసుకున్నారంటూ మాకు నోటీసులు పంపారు.  – చలంచర్ల లక్ష్మీనారాయణ, గిరిజనుడు, చౌకిచర్ల, విడవలూరు మండలం 

కఠిన చర్యలు తీసుకోవాలి  
యాక్సిస్‌ బ్యాంక్‌ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. మా జాతి ప్రజలను మోసం చేసిన జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఫేక్‌ కంపెనీలను సృష్టించి ఎస్సీ, ఎస్టీలను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపించి మోసం చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు మోసగాళ్లను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి. – కేసీ పెంచలయ్య, అధ్యక్షుడు, యానాదుల సంక్షేమ సంఘం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement