ఆదుకోండి మహాప్రభో!!

Auto industry seeks stimulus package from govt - Sakshi

ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి

వాహనాలపై జీఎస్‌టీ తగ్గించండి

కేంద్రానికి  వాహన పరిశ్రమ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్‌ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ, ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ విభాగం).. ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన రాజన్‌ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము.

డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను‘ అని భేటీ అనంతరం రాజన్‌ వధేరా చెప్పారు. ఆటోమొబైల్‌ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్‌ సావంత్‌ తెలిపారు. ‘చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది‘ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.  

దాదాపు ఏడాదికాలంగా అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్‌ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్‌ఏడీఏ ప్రకటించింది.  

రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు..
రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్‌ సామర్థ్యం లో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు వధేరా చెప్పారు.  ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి.

రుణ లభ్యత పెరిగేలా చూడాలి..
‘తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము‘ అని వధేరా చెప్పారు.  పాత, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్‌ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్‌ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top