భారత ఉక్కు రంగంలోకి ‘ఆర్సెలర్‌’

ArcelorMittal says it has completed acquisition of Essar Steel - Sakshi

పూర్తయిన ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌

దివాలా చట్టం కింద పరిష్కారమైన అతి పెద్ద కేసు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్‌ మిట్టల్‌ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కల ఎట్టకేలకు ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ ద్వారా సాకారమయింది. ఈ టేకోవర్‌ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ పేర్కొంది.  

అతి పెద్ద దివాలా రికవరీ...
ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీని రూ.42,000 కోట్లకు ఆర్సెలర్‌ మిట్టల్‌ టేకోవర్‌ చేయడానికి సుప్రీం కోర్టు గత నెలలోనే ఆమోదం తెలిపింది. దివాలా చట్టం కింద (ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌–ఐబీసీ) పరిష్కారమైన అతి పెద్ద రికవరీ ఇదే. నిప్పన్‌ స్టీల్‌ కంపెనీతో కలిసి ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ (ఆర్సెలర్‌ మిట్టల్‌ /నిప్పన్‌ స్టీల్‌ (ఏఎమ్‌/ఎన్‌ఎస్‌ ఇండియా)) ఇకపై ఎస్సార్‌ స్టీల్‌ను నిర్వహిస్తుంది.

ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ చైర్మన్‌గా అదిత్య మిట్టల్‌ (ప్రస్తుత ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీ సీఎఫ్‌ఓ, ప్రెసిడెంట్‌ ) వ్యవహరిస్తారు. ఈ జేవీలో ఆర్సెలర్‌ మిట్టల్‌కు 60 శాతం, నిప్పన్‌ స్టీల్‌ కంపెనీకి 40 శాతం  చొప్పున వాటాలున్నాయి. లగ్జెంబర్గ్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌... భారత్‌లో అడుగిడాలని చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిశాల్లో 12 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భూ సేకరణ, పర్యావరణ, ఇతర అనేక అవరోధాల కారణంగా ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top