ఎయిరిండియా వాటా విక్రయానికి ఆమోదం

Approval for sale of Air India share - Sakshi

ఈఓఐలకు కూడా జీఓఎమ్‌ ఓకే

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, ఎయిరిండియాలో వాటా విక్రయానికి మరో అడుగు ముందుకు పడింది. వాటా కొనుగోలుకు అసక్తిగల సంస్థల నుంచి  ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)దరఖాస్తులను స్వీకరించడానికి జీఓఎమ్‌(మంత్రుల సంఘం–గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పచ్చజెండా ఊపింది. అంతే కాకుండా వాటా కొనుగోలు ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. హోమ్‌ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన గల జీఓఎమ్‌ మంగళవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు.

ఎయిరిండియా వాటా విక్రయానికి సంబంధించి ఈఓఐ, వాటా కొనుగోలు ఒప్పందాలను ఈ నెలలోనే జారీ చేస్తామని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులకు ఒక స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని, రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా ఎయిరిండియా స్పెసిఫిక్‌ ఆల్టర్నేటివ్‌ మెకానిజమ్‌ (ఏఐఎస్‌ఏఎమ్‌) రూపొందించిందని వివరించారు. వాటా కొనుగోలు ఒప్పందంలో భాగంగా  ఎయిరిండియాకు చెందిన మొత్తం  రుణాన్ని ఒక ప్రత్యేక కంపెనీకి (ఎస్‌పీవీ) బదిలీ చేస్తారు.  ఇప్పటికే సంస్థకు చెందిన రూ.29,400 కోట్ల రుణాన్ని ఎస్‌పీవీకి బదిలీ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియాకు రూ.8,556 కోట్ల నికర నష్టాలు రాగా, రుణ భారం రూ.80,000 కోట్లుగా అంచనా. జీఓఎమ్‌  సమావేశానికి  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ  మంత్రి పీయుష్‌ గోయల్, విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి హాజరయ్యారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top