ఆటో రంగంలో తగ్గనున్న నియామకాలు

appointments slow down in auto mobile sector - Sakshi

కొత్త నైపుణ్యాలకు డిమాండ్‌

ఫిక్కి, నాస్కామ్‌ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో నియామకాలు నెమ్మదించనున్నాయని ఫిక్కి–నాస్కామ్, ఈవై అధ్యయనం పేర్కొంది. ఈ రంగంలో నియామకాలు చారిత్రకంగా చూస్తే 3 నుంచి 3.5 శాతం మేర వృద్ధి చెందగా, 2 నుంచి 2.5 శాతానికి తగ్గుతాయని ఈ నివేదిక తెలిపింది. నూతన టెక్నాలజీల ప్రవేశం, ఆటోమేషన్‌ పెరగడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. నూతన తరం టెక్నాలజీల రాకతో కొత్త నైపుణ్యాల అవసరం ఈ రంగంలో ఏర్పడిందని ‘భారత్‌లో ఉద్యోగాల భవిష్యత్తు’ పేరుతో నిర్వహించిన అధ్యయనం వివరించింది.  

ఇంకా ఏం చెప్పిందంటే?
‘‘ఆటోమొబైల్‌ రంగం 2017 మార్చి నాటికి 1.28 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాల సంఖ్య 2022 నాటికి 1.43 కోట్లకు పెరుగుతాయి. ఇందులో 60–65 శాతం మేర ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను సంతరించుకోవాల్సి ఉంటుంది. వెల్డింగ్, ప్రెస్, క్యాస్ట్, పెయింట్‌ షాపుల్లో రోబోలను ఇప్పటికే 70–100 శాతం మేర వినియోగిస్తున్నారు.

రోబోల వాడకం పెరిగే కొద్దీ పెయింటింగ్, వెల్డింగ్‌ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది. అదే సమయంలో రోబోటిక్‌ ప్రోగ్రామింగ్, నిర్వహణకు డిమాండ్‌ ఏర్పడుతుంది. వచ్చే ఐదేళ్లలో కనెక్టెడ్‌ కార్ల ప్రవేశం కారణంగా బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, కొత్త టెక్నాలజీలు అన్నవి డిజైన్, ఆపరేషన్‌ స్థాయిలో అవసరం అవుతాయి. ఆటోమొబైల్‌ అనలైటిక్స్‌ ఇంజనీర్, 3డీ ప్రింటింగ్‌ టెక్నీషియన్, మెషిన్‌ లెర్నింగ్, వాహన సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అనే ఉద్యోగాలు వస్తాయి’’.  

కొత్త టెక్నాలజీలకు సన్నద్ధం కావాలి...
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, భారత్‌లో తయారీ కింద పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆటోమోటివ్‌ రంగంలో రానున్న సంవత్సరాల్లో నైపుణ్య కార్మికులకు డిమాండ్‌ పెరగనుంది. కొత్త టెక్నాలజీలు వచ్చినందున పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యోగులకు తిరిగి శిక్షణనివ్వడం ద్వారా కొత్త తరహా బాధ్యతలకు సన్నద్ధం కావాలి’’ అని ఈవై పార్ట్‌నర్‌కు చెందిన అనుగార్‌ మాలిక్‌ పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top