
ఐదేళ్లలో సాధించాలని లక్ష్యం
ప్రస్తుతం పరిశ్రమ పరిమాణం రూ. 22 లక్షల కోట్లు
కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.
ప్రస్తుతం అమెరికా పరిశ్రమ రూ. 78 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, రూ. 47 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ‘భారత వాహన పరిశ్రమను ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టాలనేది మా లక్ష్యం. ఇది కాస్త కష్టమే, అయినప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు’ అని గడ్కరీ చెప్పారు. భారత్‌లో అత్యంత నాణ్యమైన వాహనాలు చౌకగా తయారవుతున్నందున, టాప్ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు.
ఈ–20కి వ్యతిరేకంగా పెట్రోల్ లాబీలు ..
ఈ–20 ఇంధనంపై (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ.. పెట్రోలియం రంగం దీనికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రతీచోట లాబీలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వారివి. పెట్రోల్ లాబీ చాలా సంపన్నమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంలో ఉపయోగించే వాహనాల్లో ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్: కుమారస్వామి
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఇప్పుడు భారత్ కూడా ఒకటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. 2024–25లో దేశీయంగా 10 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు. వీటిలో ఈ–టూవీలర్ల వాటా 1 శాతంగా, త్రీ–వీలర్ల వాటా 57 శాతంగా ఉందని చెప్పారు. ఆటో రిటైల్ సదస్సుకు పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పెంచాలి..
శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ. 22 లక్షల కోట్లు వెచి్చస్తోందని, ఇటువంటి ఇంధనాల వల్ల కాలుష్య సమస్య వస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ కంపెనీలు చౌకగా పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు తయారు చేస్తున్నాయని వివరించారు. అయితే, దేశీయంగా ఏటా 1,00,000 మేర ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే తయారీ సామర్థ్యం మాత్రం 50,000–60,000 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎగుమతులకు కూడా భారీగా అవకాశాలు ఉన్నందున ఎలక్ట్రిక్ బస్సుల తయారీని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందని, కొన్నాళ్లకు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. పెట్రోల్, డీజిల్ వాహనాల రేట్లకు సమానం అవుతాయని మంత్రి చెప్పారు.