ట్రంప్‌ను పట్టించుకోని ఫెడ్‌ | The American Central Bank who does not care for trump ambitions | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను పట్టించుకోని ఫెడ్‌

Dec 21 2018 1:06 AM | Updated on Dec 21 2018 1:06 AM

The American Central Bank who does not care for trump ambitions - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌... మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడ్‌ నాలుగు దఫాలు వడ్డీరేట్లను పెంచినట్లయింది. ఒకపక్క రేట్లపెంపుపై యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఫెడ్‌ రేట్ల పెంపునకు సిద్ధపడడం గమనార్హం. ఈ ఏడాది అమెరికా ఎకానమీ బాగా బలపడిందని, దాదాపు అంచనాలకు తగినట్లే వృద్ధి నమోదు చేస్తోందని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక వడ్డీరేట్లను మరో పావు శాతం పెంచుతున్నామన్నారు. తాజా పెంపుదలతో ఫెడ్‌ రేటు 2.25–2.5%కి చేరింది. ఇదేమీ అసాధారణమైన పెంపు కాదని తెలిపారు. 

ప్రభావం చూపని ట్రంప్‌ ట్వీట్‌ 
ఫెడ్‌ సమావేశానికి ముందు రేట్లను పెంచొద్దని, మరో తప్పు చేయొద్దని ఫెడ్‌ను ఉద్దేశించి ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయానికి ముందు ఫెడ్‌ సభ్యులు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఎడిటోరియల్‌ చదవాలని కూడా ట్వీట్‌లో సూచించారు. రేట్లను పెంచి మార్కెట్లో లిక్విడిటీ కొరతను తీసుకురావద్దని కోరారు. ఇంత చెప్పినా ఫెడ్‌ మాత్రం రేట్లను పెంచేందుకే సిద్ధమైంది. కాకపోతే దీనిపై ట్రంప్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్‌ అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపవని ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు.



వచ్చే ఏడాది రెండు సార్లకే పరిమితం 
‘‘2019లో మరో 3 మార్లు రేట్లు పెంచేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులుంటాయని ఫెడ్‌ సభ్యుల్లో ఎక్కువమంది గతంలో అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే సంవత్సరం మరో 2 దఫాలు రేట్లు పెంచితే సరిపోవచ్చు. అయితే మా నిర్ణయాలను ముందుగానే నిర్ధారించలేం. అప్పటికి అందే ఆర్థిక గణాంకాలే విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను సైతం పరిశీలిస్తూ ఉంటాం’’ అని పావెల్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement