
రేపు యూఎస్ ఫెడ్ రేట్ల సమీక్ష
జీడీపీ, ఉపాధి గణాంకాలు సైతం
దేశీ కార్పొరేట్ల క్యూ1కూ ప్రాధాన్యం
గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు
ఈ వారం మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం యూఎస్ కేంద్ర బ్యాంకు రేట్ల సమీక్ష, జీడీపీ, ఉపాధి గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా నేడు(28న) జూన్ పారిశ్రామికోత్పత్తి వివరాలు తెలియనున్నాయి. అంతేకాకుండా ఈ వారం మరిన్ని
కంపెనీల క్యూ1 ఫలితాల వెల్లడికానున్నాయి. వివరాలు చూద్దాం..
దేశీయంగా నేడు జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. మే నెలలో ఐఐపీ వార్షికంగా 1.2 శాతం పుంజుకుంది. ఇక మరోవైపు ఇప్పటికే జోరందుకున్న కార్పొరేట్ల తొలి త్రైమాసిక(క్యూ1) ఫలితాల సీజన్ కొనసాగనుంది. ఈ వారం క్యూ1(ఏప్రిల్–జూన్) పనితీరు ప్రకటించనున్న జాబితాలో 28న ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్‌సహా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టొరెంట్ ఫార్మా, గెయిల్ ఇండియా, మజగావ్ డాక్ షిప్, వారీ ఎనర్జీస్, ఉన్నాయి.
ఇదే విధంగా 29న ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హ్యుందాయ్ మో టార్స్, ఇండస్ టవర్స్, కేన్స్ టెక్నాలజీ, కేపీ ఐటీ టె క్, 30న హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఐషర్, టీవీఎస్ మోటార్, స్విగ్గీ, డాబర్ ఇండి యా, ఆగస్ట్ 1న ఐటీసీ, టాటా పవర్, గోద్రెజ్ ప్రా పరీ్టస్, జీఎస్‌కే ఫార్మా, ఎంసీఎక్స్, హనీవెల్ ఆటోమేషన్, ఎల్‌ఐసీ హౌసింగ్ జాబితాలో చేరాయి.
ఎఫ్‌అండ్‌వో ముగింపు
జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారం(31న) ముగియనుంది. ఇవికాకుండా జూన్ నెలకు ఆటో అమ్మకాలు, టెలికం సబ్‌స్క్రయిబర్ల వివరాలు తదితర గణాంకాలు సైతం ఈ వారం వెలువడనున్నాయి. ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా అమ్మకాలు చేపడుతున్నారు. వీటితోపాటు థాయ్‌లాండ్, కాంబోడియా వివాదాలు, ప్రపంచ మార్కెట్ల తీరు.. తదితర అంశాలన్నిటిపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొనవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు.
ట్రేడ్ డీల్స్‌పై కన్ను
భారత్‌సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు వాణిజ్య సుంకాలను విధించిన విషయం విదితమే. వీటిపై సస్పెన్షన్ గడువు ఆగస్ట్ 1న ముగియనున్న నేపథ్యంలో యూఎస్‌తో వాణిజ్య ఒప్పందాలు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు అంచనా వేశారు.
ఫెడ్ నిర్ణయాల ఎఫెక్ట్
యూఎస్ ఫెడ్ 29న పాలసీ సమీక్ష చేపట్టనుంది. ఉపాధి సంబంధ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 30న క్యూ2(ఏప్రిల్–జూన్) జీడీపీ ముందస్తు గణాంకాలు వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్ యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. ఈసారి కూడా రేట్లలో మార్పులు చేపట్టకపోవచ్చని, సెప్టెంబర్‌కు వాయిదా వేయవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
సాంకేతికంగా..
2024 అక్టోబర్ తదుపరి ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ నిఫ్టీ వరుసగా నాలుగో వారమూ నష్టాలతో ముగిసిన నేపథ్యంలో ఈ వారం సైతం మార్కెట్లు మరింత క్షీణించవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. నిఫ్టీ బలహీనపడితే 24,790, 24,620 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. ఇంతకంటే నీరసిస్తే 24,480 వద్ద సపోర్ట్ ఉందని పేర్కొన్నారు. ఒకవేళ బలపడితే.. స్వల్ప కాలానికి 25,200, 25,300 పాయింట్లస్థాయిలో అవరోధాలు ఎదురుకావచ్చని విశ్లేíÙంచారు.
గత వారమిలా..
గత వారం(21–25) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోసారి నికరంగా నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 295 పాయింట్లు(0.4 శాతం) డీలాపడి 81,463 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 131 పాయింట్లు(0.5 శాతం) నీరసించి 24,837 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 1.5% స్థాయిలో నష్టపోయాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్