
బంగారానికి భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భరోసానిచ్చే సాధనంగా సాధారణ ప్రజలు పసిడిని కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖరీదు చేస్తారు. వీరితోపాటు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియాతోపాటు చాలా దేశాలు ఎందుకు ఇలా భారీగా పసిడిని కొనుగోలు చేస్తాయో తెలుసుకుందాం.
కరెన్సీకి అండగా..
ద్రవ్యోల్బణం పెరుగుతూ, దేశ కరెన్సీ విలువ తగ్గుతుంటే దాన్ని కాపాడేందుకు బంగారం హెడ్జింగ్‌గా పని చేస్తుంది. ముద్రించిన కరెన్సీ(ఫియట్ కరెన్సీ) విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువ బలపడుతుంది. ఇది దిగుమతులకు ఆసరాగా ఉంటుంది. అస్థిరత సమయాల్లో బంగారం జాతీయ కరెన్సీలను కాపాడుతుంది. దేశం ద్రవ్య విధాన చట్రానికి విశ్వసనీయతను అందిస్తుంది.
రిస్క్ వైవిధ్యం
కేంద్ర బ్యాంకులు రిస్క్‌ను డైవర్సిఫై చేసేందుకు బంగారం నాన్-కోరిలేటెడ్ ఆస్తిగా ఉపయోగపడుతుంది. దీని విలువ ఈక్విటీలు లేదా బాండ్లతో అనుగుణంగా పడిపోదు. యూఎస్ డాలర్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. ఇది రిజర్వ్ పోర్ట్ ఫోలియోల్లో స్మార్ట్ డైవర్సిఫికేషన్ హెడ్జ్‌గా మారుతుంది.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు
బంగారం ఏ ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడం ఏ ఒక్క దేశంలో వల్లనో సాధ్యం కాదు. దీని విలువపై ఎన్నో అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ కరెన్సీ నిల్వల మాదిరిగా కాకుండా, బంగారాన్ని స్తంభింపజేయడం లేదా దానిపై రాజకీయం చేయడం సాధ్యం కాదు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచాయి.
లిక్విడిటీ
బంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విటిటీ ఆస్తుల్లో ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు.
టాప్ 8 దేశాల్లోని బంగారు నిల్వలు..
దేశం | బంగారం నిల్వలు (టన్నులు) |
---|---|
అమెరికా | 8,133.46 |
జర్మనీ | 3,350.25 |
ఇటలీ | 2,451.84 |
ఫ్రాన్స్ | 2,437.00 |
రష్యా | 2,329.63 |
చైనా | 2,279.60 |
స్విట్జర్లాండ్ | 1,040.00 |
భారతదేశం | 880.00 |