అదానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో నిరసనలు | Adani Australia project hits protest wave | Sakshi
Sakshi News home page

అదానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో నిరసనలు

Oct 9 2017 1:23 AM | Updated on Oct 9 2017 12:23 PM

Adani Australia project hits protest wave

మెల్‌బోర్న్‌: అదానీ గ్రూపునకు చెందిన ప్రతిపాదిత రూ.లక్ష కోట్లకుపైగా విలువైన కార్మికేల్‌ బొగ్గు గనిని వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మరోసారి నిరసనలు మిన్నంటాయి. ‘నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌’ సందర్భంగా సిడ్నీ, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, గోల్డ్‌ కోస్ట్, నార్త్‌ క్వీన్స్‌ల్యాండ్‌లోని పోర్ట్‌ డగ్లస్‌లో వేలాది మంది నిరసన కారులు రోడ్లపైకి వచ్చి తమ ఆందోళన తెలియజేశారు.

మెల్‌బోర్న్‌లోని ప్రిన్సెస్‌ పార్క్‌లో నిర్వహించిన ర్యాలీలో 2,000 మంది పాల్గొన్నారు. ‘బొగ్గు అంటే కార్బన్‌ డై ఆక్సైడ్, మన భవిష్యత్తును కాపాడండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. సిడ్నీ ర్యాలీలోనూ భారీ సంఖ్యలోనే  పాల్గొన్నారు. ‘అదానీని నిలువరించండి’ అంటూ ప్రచారం నిర్వహించిన ఇజాయెక్‌ ఆస్టిల్‌ మాట్లాడుతూ.. వాతావరణం కలుషితమైపోతున్న తరుణంలో దక్షిణార్ధగోళంలో వస్తున్న అతిపెద్ద బొగ్గు గని ఇదేనన్నారు.

ఆస్ట్రేలియన్‌ కన్జర్వేషన్‌ ఫౌండేషన్‌ సీఈవో కెల్లీ ఓ షనాస్సీ స్పందిస్తూ.. పన్ను చెల్లింపుదారుల ధనాన్ని కార్మికేల్‌ ప్రాజెక్టుకు సబ్సిడీగా వినియోగించకూడదన్న బలమైన సందేశాన్ని ‘బిగ్‌ డే ఆఫ్‌ యాక్షన్‌’ పంపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఉద్యోగ కల్పనకు కట్టుబడి ఉన్నాం: అదానీ
ఆస్ట్రేలియాలో ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ కట్టుబడి ఉందని అదానీ ఆస్ట్రేలియా సీఈవో జయకుమార్‌ జనకరాజ్‌ స్పష్టం చేశారు. కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుకు స్థానికంగా పెద్ద ఎత్తున మద్దతు ఉందన్నారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది కొద్ది మందేనన్నారు. ప్రాజెక్టు ముందస్తు పనులు వచ్చే కొన్ని వారాల్లోనే మొదలవుతాయని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement