టీవీలు, ఏసీలు ఆన్‌‘లైనే’...

23 billion dollers worth of consumer durable sales in India to have digital influence by 2023 - Sakshi

వచ్చే నాలుగేళ్లలో డిజిటల్‌ ప్రభావం 23 బిలియన్‌ డాలర్ల స్థాయికి

బీసీజీ, గూగుల్‌ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్‌లైన్‌లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్‌ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజిటల్‌ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు.

‘ప్రస్తుతం కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ అమ్మకాల్లో దాదాపు 28% విక్రయాలు డిజిటల్‌ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63%కి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్‌ డాలర్ల మేర అమ్మకాలు ఆన్‌లైన్‌ విక్రయాలే ఉంటాయని అంచనా‘ అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు, చిన్న గృహోపకరణాలు, వాటర్‌ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్‌ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై 33% డిజిటల్‌ ప్రభావం ఉంటోంది.  

కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్‌ ప్రభావం..
నివేదిక ప్రకారం.. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్‌ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలుకు ముందు దాదాపు 80% మంది డిజిటల్‌ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2–3 వారాలు ఆన్‌లైన్‌లో అధ్యయనం చేశాకే కొంటున్నారు. సెర్చి, సోషల్‌ మీడియా, బ్లాగ్‌లు, ఆన్‌లైన్‌ వీడియోలు మొదలైనవి ఆన్‌లైన్‌ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్‌ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్‌ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ (సేల్స్‌) వికాస్‌ అగ్నిహోత్రి చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top