సమ్మెకు సైరన్‌

central trade unions call on strike - Sakshi

ఏకమై ఆందోళనకు దిగుతున్న జాతీయ కార్మిక సంఘాలు  

25న జీఎం కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు

 ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న టోకెన్‌ సమ్మె

 మరో జాతీయ కార్మిక సంఘం హెచ్‌ఎంఎస్‌ దూరం   

జాతీయ కార్మిక సంఘాలు సమ్మె సైరన్‌ మోగించాయి. నాలుగ సంఘాలు ఏకమై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఆందోళనబాట పట్టాయి. గుర్తింపు సంఘం ఎన్నికల ముందు, తర్వాత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు పోరుసల్పాలని పిలుపునిచ్చాయి. ఐదు రోజుల క్రితం ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌ సీఎండీ ఎన్‌ శ్రీధర్‌కు సమ్మె నోటీసు అందించాయి. మరో రెండు రోజుల్లో ఆర్‌ఎల్సీకి  కూడా నోటీస్‌ ఇవ్వనున్నాయి. 

శ్రీరాంపూర్‌(మంచిర్యాల జిల్లా) : కార్మికుల ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 14న ఒక రోజు టోకెన్‌ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయి. అక్టోబర్‌ 5న జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు రెండోసారి టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఎన్నికల ముందు సెప్టెంబర్‌ 29న, ఎన్నికలు తరువాత అక్టోబర్‌ 8న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ సాక్షిగా కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికలు ముగిసి ఇప్పటి 3 నెలలవుతున్నా అమలు చేయడంలేదు. దీంతో కార్మిక నేతలకు ఆందోళనకు దిగుతున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌ సమ్మెకు పిలుపునివ్వగా మరో జాతీయ కార్మిక సంఘం హెచ్‌ఎంఎస్‌ సమ్మెకు దూరంగా ఉంది.

  
25 నుంచి కంపెనీ వ్యాప్తంగా రిలే దీక్షలు.. 
సమ్మె విజయవంతానికి జాతీయ సంఘాలు ఈ నెల 25 నుంచి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంల కార్యాలయాల ముందు సామూహిక రిలే నిరాహార దీక్షలు  చేయాలని నిర్ణయించారు. అన్ని ఏరియాలకు తిరుగుతూ ప్రెస్‌మీట్లు పెడుతూ, సమావేశాలు నిర్వహిస్తూ సమ్మెకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు.

 
మౌన ముద్రలో టీబీజీకేఎస్‌ నేతలు
సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినా టీబీజీకేఎస్‌లో ఇంకా అనిశ్చితి వీడలేదు. కమిటీలు లేక, గుర్తింపు పత్రం తీసుకోక, అధికారంలో ఉన్నామా లేమా అన్న చందంగా నేతలు మౌన ముద్రలో ఉండిపోయారు. కమిటీల ప్రకటన చేసే వరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని, కార్యక్రమాలు చేపట్టొద్దని అధిష్ఠానవర్గం నుంచి ఆదేశాలు ఉండటంతో యూనియన్‌ ముఖ్య నాయకులు కిమ్మనకుండా చూçస్తూ ఉన్నారు. కమిటీల్లో జాప్యం వల్ల నేతలు అసహనం పెరగడమే కాకుండా, ప్రతిపక్ష సంఘాలు చేసే ఆందోళన కార్యక్రమాలను ప్రతిఘటించడానికి అధిష్ఠానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప స్పందించే పరిస్థితి లేదు.

ప్రధానంగా కారుణ్య నియామకాలు జాప్యం జరుగడంతో టీబీజీకేఎస్‌ నేతలే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గెలిచినా కార్మికులవద్దకు వెళ్లలేని పరిస్థితి ఉం దని కొందరు నేతలు వాపోతున్నారు. ఎన్నికలు జరిగిన 3 నెలలకే సమ్మె చేయడం.. రాజకీయ లబ్ధికోసమేనని టీబీజీకేఎస్‌ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే క్వార్టర్లకు ఏసీలు, తల్లిదండ్రులకు కార్పొరేట్‌ వైద్యం, ఇంకా ఇతర డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఉత్తర్వులు ఇచ్చిన కూడా సమ్మెకు పిలుపునివ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

 
టోకెన్‌ సమ్మె డిమాండ్లు 
కారుణ్య నియామకాల పేరుతో ఇస్తామన్నా వారసత్వ ఉద్యోగాలకు వెంటనే ఇవ్వాలి 
కార్మికులకు సొంతింటికి స్థలం, వసతులతో పాటు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి 
మారుపేర్లతో పని చేసే వారిని రెగ్యులరైజ్‌ చేయాలి 
క్వార్టర్లకు ఏసీ పెట్టుకునేందుకు ఉచిత కరెంట్‌ ఇవ్వాలి. 
తల్లిదండ్రులకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తూ యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయి. వీటిని మార్చాలి 
10 వేజ్‌బోర్డు బ్యాలెన్స్‌ ఎరియర్స్, ఇందులో సింగరేణిలో అమలు కాని ఒప్పందాలను అమ లు చేయాలి 
ఎల్‌టీసీ, ఎల్‌ఎల్‌టీసీలకు లీవులు పెట్టుకోకుండానే డబ్బులు చెల్లించాలి 
కొత్తగా 6 భూగర్భ గనులు తవ్వాలి 
వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఇంకా ఇతర డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. 
 

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top