అట్టహాసంగా టీటీడీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

YV Subbareddy Sworn In As TTD Chairman - Sakshi

11.47కు బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి

తులాభారంతో మొక్కు చెల్లింపు

తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు

టీటీడీ చైర్మన్‌ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. తిరుమలలో శనివారం ఉదయం 11.47 నిమిషాలకు ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ 50వ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారిని దర్శించుకుని తులాభారం సమర్పించారు. సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ  తిష్టవేసిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని ప్రతినబూనారు.

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ.సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకున్నారు. తమ పార్టీ ముఖ్యనాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. నిర్ణయించిన ముహూర్తానికి బంగారు వాకిలిలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డి చేత టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ చైర్మన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈఓ స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత తన బరువుకు సమానంగా పెద్దకలకండ, చిన్నకలకండ, బెల్లం, బియ్యం, నెయ్యి, నవధాన్యాలతో వైవీ.సుబ్బారెడ్డి శ్రీవారికి తులాభారం సమర్పించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారని, అందుకనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. తిరుమలలో తాగునీరు, అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. శ్రీవారి ఆభరణాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
 
అన్నప్రసాదం స్వీకరణ..
ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి వెళ్లారు. అక్కడ భక్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. టీటీడీ చైర్మన్‌ సతీమణి స్వర్ణమ్మ భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తరువాత అన్నప్రసాద క్యూకాంప్లెక్స్, వంటశాలను పరిశీలించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వీరి వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ విజయ్‌సాయిరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి, శాసన మండలి చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్, రెడ్డి రవీంద్రారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, యువ నాయకుడు భూమన అభినయ్‌ రెడ్డి, టీటీడీ జేఈఓలు శ్రీనివాసరాజు, లక్ష్మీకాంతం, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, పలువురు అర్చకులు పాల్గొన్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top