నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి

yv subba reddy demanded for action on narayana educational institutions - Sakshi

జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు  

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: మానసిక వేధింపులకు పాల్పడుతూ, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. బుధవారం ఢిల్లీలో కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్తుతి కక్కర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ, శ్రీచైతన్య భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీల్లో గత మూడేళ్లలో 40 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కమిషన్‌కు వివరించారు. ఈ విద్యా సంస్థల చైర్మన్‌ నారాయణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని, దీంతో రాష్ట్ర సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్నారులతో వివిధ టాస్క్‌లు చేయించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న బ్లూ వేల్‌ గేమ్‌ తరహాలోనే.. నారాయణ విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు టాస్క్‌లు, టార్గెట్లు విధిస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వివరించారు. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో 2015లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీలో 96 మంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలిందన్నారు. అధ్యాపకుల వేధింపులు, విద్యా సంస్థలు క్రూరంగా వ్యవహరించడం వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదికలో పేర్కొందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హాస్టళ్లలో కూడా పరిస్థితి దారుణంగా ఉందని వివరించారు.

తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ చదువు.. చదువు.. అంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఒకవేళ తక్కువ మార్కులొస్తే ఆ విద్యార్థిని ఎందుకు పనికిరావంటూ అవహేళన చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కార్పొరేట్‌ కాలేజీలు హాస్టళ్లు నిర్వహిస్తున్నాయని సాక్షాత్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అంగీకరించారని కమిషన్‌కు వివరించారు. అక్కడి పరిస్థితులేమీ బాగాలేదని స్వయంగా మంత్రే చెప్పారని, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం చేస్తున్న తప్పేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా పేద, ధనిక తారతమ్యం లేకుండా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. ఈ వ్యవహారాలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో మీరైనా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను వైవీ సుబ్బారెడ్డి కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top