
దేశాన్ని కూడా విభజిస్తారా?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, ఇదే తీరులో రేపటి రోజున దేశాన్ని కూడా విభజిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది.
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, ఇదే తీరులో రేపటి రోజున దేశాన్ని కూడా విభజిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, కె.శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, జుట్టు జగన్నాయకులు మాట్లాడారు. విదేశీ వ్యక్తుల ఆధిపత్యానికి పార్లమెంటు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ ఆత్మ ఘోషించేలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తీసుకొచ్చిన సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమికొట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇంకా ఏమన్నారంటే...
దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నన్నాళ్లూ ఢిల్లీ నాయకులు రాష్ట్రంవైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయారు. ఆయన మరణం తర్వాత అసమర్థ సీఎం, చేతకాని ప్రధాన ప్రతిపక్షం వల్ల రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి తలెత్తింది.
గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు మద్దతిచ్చుంటే ఈరోజు రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి వచ్చేదికాదు.
రాష్ట్ర విభజనకు కుట్రపన్నిన చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై అసెంబ్లీ వేదికగా డ్రామా నడిపించారు. సమైక్య తీర్మానం కూడా చేయకుండా అడ్డగించారు.
కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పనిచేస్తున్న సీఎం కిరణ్‌ను, టీడీపీ అధినేత చంద్రబాబు పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కిరణ్ అవినీతిని బాబు ఎందుకు ప్రశ్నించడంలేదు?
దొంగతనంగా పెడతారా?: వాసిరెడ్డి పద్మ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని భారీ ఎత్తున ఉద్యమం సాగుతూంటే లెక్క చేయకుండా దొంగతనంగా దొడ్డిదారిన విభజన బిల్లును లోక్‌సభలోకి ఎందుకు తెచ్చారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. గురువారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బిల్లు వస్తుందో రాదోనన్న సందిగ్ధంలో ఉన్నపుడు చివరి నిమిషంలో అనూహ్యంగా తీసుకురావడాన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో కూడా ఎవరూ హర్షించరని అన్నారు. ఈ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి పూర్తిగా బయట పడిందని ఆమె విమర్శించారు. ఆరు నెలల క్రితం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ఆనాడే ఎమ్మెల్యేలు, మంత్రులంతా రాజీనామాలు చేసి ఢిల్లీలో ధర్నాకు కూర్చుని ఉంటే విభజన వ్యవహారం ఇంత దాకా వచ్చి ఉండేది కాదన్నారు.
చలో ఢిల్లీ - సేవ్ ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రూపొందించిన ‘చలో ఢిల్లీ’, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పోస్టర్లను పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 17న చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రెండు పోస్టర్లను రూపొందించినట్లు విద్యార్థి విభాగం నాయకుడు మల్లాది సందీప్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి కృష్ణమోహన్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల, సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ పాల్గొన్నారు.