అవసరమైతే ఆయనతో చర్చకు సిద్ధమే...

YSRCP MLA Candidate Botsa Satyanarayana Interview With Sakshi

సాక్షి ప్రతినిధితో వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ 

రాష్ట్రరాజకీయాల్లో ఆయనదో వినూత్న ఒరవడి. ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చి పదవులకే వన్నె తెచ్చిన నాయకుడతను. పల్లెలో పుట్టినా... ఢిల్లీవరకూ ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారాయన. ఉత్తరాంధ్ర రాజకీయ ఉనికిని రాష్ట్రవ్యాప్తం చేసిన ఘనుడాయన. ఎంత ఎత్తుకు ఎదిగినా... తన ఎదుగుదలకు పునాదివేసిన విజయనగరం జిల్లాను... అందునా చీపురుపల్లి నియోజకవర్గంపైనా అమిత ప్రేమాభిమానాలున్నాయి. అక్కడి వారందరి హృదయాలను గెలుచుకుని... వారి ప్రేమాభిమానాలే ఊపిరిగా సాగుతున్న ఆయనే మన బొత్స సత్యనారాయణ. వైఎస్సారసీపీ రాష్ట్రనాయకునిగా ఓ వైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.... చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాపైనా... నియోజకవర్గం అభివృద్ధిపైనా ఆయనకున్న లక్ష్యాలను సాక్షి ప్రతినిధికి తెలిపారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

మొదటిసారిగా ఎమ్మెల్యేగా 2004లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాను. చీపురుపల్లి, గరివిడి రెండు మండలాలు, అటు జి.సిగడాం, పొందూరు రెండు మండలాలు నియోజకవర్గంగా ఉండేవి. ఆ రోజుల్లో ఇవన్నీ మెట్ట ప్రాంతాలు. చీపురుపల్లి, గరివిడి ప్రాంతాల్లో వరి పంట ఎక్కువగా పండుతుంది. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలన్నది నా ఆకాంక్ష. అందుకే నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఇక్కడివారందరికీ మాటిచ్చా. రాజశేఖరరెడ్డి గారు వస్తారు. ఈ నియోజకవర్గానికి తోటపల్లి నీటిని తీసుకు వస్తానని చెప్పాను. ఈ రెండు ప్రాంతాలతో పాటు అటు ఎచ్చెర్ల, ఇటు మెరకముడిదాం ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు అప్పట్లో రాజశేఖరరెడ్డి గారితోనే పనులకు శంకుస్థాపన చేయించి, పనులు మొదలు పెట్టాం. ఆపడానికి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా అందరినీ ఒప్పించి, మంచి ప్యాకేజీ ఇప్పించి సమస్య పరిష్కరించాను. 

ప్రతిగ్రామానికీ తాగునీరందించాం
రెండోసారి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా చాలా సమస్యలు పరిష్కరించాను. అప్పట్లో ప్రతీ గ్రామానికి తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేది. సంప్‌ దగ్గర బోరు తవ్వించి గ్రావిటీ మీద పైపులైన్‌ వేసి ప్రతీ గ్రామానికి తాగునీటి ట్యాంకు కట్టి సిగడాం, పొందూరు గ్రామాలకు కూడా  తాగునీటిని అందించాను. 2009లో గుర్ల, మెరకముడిదాం మండలాలు కలిశాయి. పొందూరు, సిగడాం శ్రీకాకుళం బోర్డర్‌లో ఉండటం వల్ల అవి శ్రీకాకుళంలో కలిశాయి. అప్పటికి తోటపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తిచేశాం. మెరకముడిదాం, గరివిడి మండలానికి కూడా తాగునీటిని అందించాం. మొత్తమ్మీద మూడు మండలాల్లోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించాం. 

ప్రతి పల్లెకు రహదారులు
ఈ గ్రామాల్లో రోడ్లు లేవు. ఒక్కో మండలానికి 50 గ్రామాలు అనుసంధానమై ఉండేవి. మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి మండలాలకు 90 శాతం అంటే దాదాపు 130, 140 గ్రామాలకు పక్కా తారురోడ్లు వేశాం. ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్లిన తారురోడ్డుతో లింక్‌ చేశాం. ఊరిపేర్లతో బోర్డులు ఏర్పాటు చేశాం. డిగ్రీ కళాశాలను తీసుకు వచ్చాం. పాలిటెక్నికల్‌ కాలేజీని తీసుకు వచ్చాం. గరివిడి , చీపురుపల్లి మేజర్‌ పంచాయతీల్లో ఇంటింటికి కుళాయిలు ఇచ్చేలా చేశాం. ప్రతి పనికీ తెలుగుదేశం నాయకులు అడ్డుతగిలారు. ఇవేవీ జరిగే పనికాదనీ, అలా ఇస్తే మేం రాజకీయ సన్యాసం తీసుకుంటామని కూడా సవాల్‌ విసిరారు. అయినా చేసి చూపించాం. 

రాష్ట్రానికి చీపురుపల్లి రోల్‌మోడల్‌ అయ్యేది
గ్రామాల్లో వచ్చే సమస్యలు అక్కడ ఒక దగ్గరే రావు. ప్రతీ విషయాన్ని రాజశేఖరరెడ్డి గారితో పంచుకునే వారం. నేను 2004లో మంత్రి అయినప్పుడు జిల్లాలోని ఏ గ్రామానికి పోయినా అత్యధికంగా పూరిపాకలే ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా, ఏ నియోజకవర్గానికి వెళ్లినా 80 నుంచి 90 శాతం పక్కా ఇళ్లు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద 3 నుంచి 4 లక్షల ఇళ్లు కట్టించాం. ఎండాకాలం వస్తే రోజూ రాత్రిళ్లు ఫైరింజన్‌ల సైరన్లే వినిపించేవి. వాటికి ఇప్పుడు పనే లేకుండా పోయింది. ఈ అయిదేళ్ల టీడీపీ పాలన చూస్తే.. మా ఊరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ప్రజలు చెబుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతుంటే బాధగా ఉంటుంది. 

కమిట్‌మెంట్‌ ఉంటేనే ఏదైనా...
రాజకీయాలకు కమిట్‌మెంట్‌ ఉండాలి. అది లేకపోతే కష్టం. ఏ సమస్య వచ్చినా దానిపైనే దృష్టి నిలపాలి. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు వస్తున్న నాయకులకు సమస్య ఎక్కడ ఉందో తెలియదు. కేంద్ర మంత్రికి గాని, రాష్ట్ర మంత్రికి గానీ ఏమీ తెలీదు. సమస్యలు తెలుసుకునేందుకు సమయం కేటాయించరు. ఎవరైనా చెబితే వినరు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయరు.

పెండింగ్‌ పనులపైనే నా దృష్టంతా...
నేను వదిలేసిన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం, తోటపల్లి నీటిని తీసుకు రావడం మెట్ట ప్రాంతమైన మెరకముడిదాం మండలానికి నీటిని తీసుకు రావడం నాముందున్న లక్ష్యం. మా నియోజకవర్గంలో యువకులు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేయాలని ఉంది. కొలంబో పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికీ నాకున్న సత్సంబంధాలను ఉపయోగించి విశాఖలో రాజశేఖరరెడ్డిగారి సాయంతో ఏర్పాటుచేసిన బ్రాండిక్స్‌లాంటి పరిశ్రమలను తీసుకురావాలని ఉంది. 

అశోక్‌గజపతి క్షమార్హుడు కాదు
విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు. ఈ జిల్లా కూడా ముందంజలో ఉండేలా అభివృద్ధి చేయాలి. విజయనగరానికి జూనియర్‌ కాలేజీని తీసుకు వచ్చింది నేనే. డిగ్రీ కళాశాల కూడా తేవాలనుకున్నాం. విజయనగరంలో యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్‌కు 150ఎకరాలు నా హయాంలోనే ఇచ్చాను. ఎలక్షన్‌ పదిరోజుల ముందు వచ్చి దానిని యూనివర్సిటీగా ప్రకటించి మాదే ఘనత అని టీడీపీ చెప్పుకుంటోంది. భోగాపురం ప్రాజెక్టును కూడా నీరు గార్చారు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టు క్లోజ్‌ చేస్తే గాని ఇది డెవలప్‌ కాదనీ, దానిని క్లోజ్‌ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

కానీ డిఫెన్స్‌ వాళ్లు దానిని విస్తరిస్తామని చెబుతున్నారు. ఆ శాఖ మంత్రిగా చేసింది జిల్లాకు చెందిన అశోక్‌గజపతిరాజు. విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరిస్తున్నారంటే సంవత్సరం ముందు నుంచి దానికి టెండర్లు పిలిచే ఉంటారు కదా. తెలిసి కూడా ఆయన మాట్లాడలేదు. ఈ విషయంలో ఆశోక్‌ గజపతిరాజును క్షమించరాదు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే రాష్ట్రం విడిపోయాక వెనుకబడిన ప్రాం తం కింద ప్యాకేజీ ఉంటుంది. ఈ విషయాన్ని విభజన చట్టంలో పెట్టించాం. ఈ ప్రాంతం వెనకబాటుపై ఒక డ్రాఫ్ట్‌ తయారు చేస్తే దాని నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. బుందేల్‌ఖండ్‌కు రూ.16 వేల కోట్లు ఇచ్చారు. అంత డబ్బు మనకూ వస్తుంది. ఆ డబ్బంతా తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఎంతో బాగుండేది. ఈ ప్రాంతానికి చెందిన అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నా ఆ పనులను పట్టించుకోలేదు.

వాళ్లకు..మాకూ అదే తేడా
తెలుగుదేశం పార్టీ మభ్యపెట్టి, మోసం చేసి, డబ్బు, అధికారం ఉంది కదా.. అనుకుంటున్నారు. మొదటిసారి ఎంపీ అయినప్పుడు ఎంపీ నిధులు రూ. 50లక్షలు కేటాయించారు. తరువాత అది రూ.కోటి చేశారు. అప్పట్లో బోరు వేస్తే రూ.2వేలు ఖర్చయ్యేది. ఊళ్లోకి వెళ్లి ఒక ఎంపీ బోరు వేయిస్తే ఎంపీగారు బోరువేయించారని ఆశ్చర్యపోయేవారు. నా కన్నా ముందు ఎంపీ అయిన వారు ఏం చేయలేదు. ప్రతీ విషయం కామన్‌ మ్యాన్‌కు రీచ్‌ అవ్వాలి కదా. మనకు దాని వల్ల గౌరవం వస్తుంది. ఎంపీ అంటే ఎలా ఉండాలన్న విషయం నా వల్లే అందరికి తెలిసింది. ఆ విషయం నేను గర్వంగా చెబుతాను. మన జిల్లాలో, నా నియోజకవర్గంలో నా ఫోన్‌ నంబరు అందరికీ తెలుసు. నా నంబర్‌ మా పీఏలు ఎత్తరు. నేనే ఎత్తుతాను. మళ్లీ మిస్డ్‌ కాల్‌ ఉంటే నేనే చేస్తాను. చీపురుపల్లి మండలంలో మా నాయకులు అందరూ నాలా యాక్టివ్‌ గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పట్టించుకుంటారు. బ్రోకరేజ్‌లు, చేయి చాచడాలు అవేం లేవు. 

జగన్‌ సీఎం అయితేనే మంచి జరుగుతుంది
ఎన్‌ఆర్‌జీఎస్‌ స్కీంను ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా విజయనగరం జిల్లాలోనే మొదలు పెట్టాం. అప్పటి ఎంపీ ఝాన్సీగారు ఆ పథకంలో నేషనల్‌ మెంబర్‌గా ఉండే వారు. అప్పట్లో ఉపాధి పనులకు వస్తే పది రోజులకో, 15 రోజులకో కూలి బట్వాడా చేసేవాళ్లం.  ఇప్పుడు నాలుగు, ఐదు నెలలు కావస్తున్నా ఇవ్వడంలేదు. అవన్నీ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే స్ట్రీమ్‌లైన్‌ చేస్తారు. సంక్షేమ పధకాలు అందరూ పొందేలా గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కరిస్తారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక యువకుడిని ప్రభుత్వమే జీతమిచ్చి నియమించి అతని ద్వారా సంక్షేమ పథకాలు అర్హులకు అందే ఏర్పాటు చేస్తారు. 

బహిరంగ చర్చకు రమ్మనండి    
ముఖ్యమంత్రి వస్తే ఆయన వెనుకాల వెళ్లడం తప్ప ఆయన చేసింది ఏమీలేదు. ధైర్యంగా చెప్పమనండి. ఆయన్ను, నన్ను డిబేట్‌కు రమ్మనండి. ఏం చేశారో చర్చిద్దాం. మా మీద కామెంట్స్‌ చేయడం కాదు. ఓపెన్‌ డిబేట్‌కు రమ్మనండి. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను పది సంవత్సరాలు మంత్రిగా చేశాను. ఏం చేశానో అన్ని చెబుతాను. నేను రెడీ.. సత్తిబాబు అబద్దం చెబుతున్నాడని, ఆ పెద్దలను చెప్పమనండి. పోలవరం ఏడు మండలాల గురించి అప్పట్లో ఇక్కడున్న చీఫ్‌ సెక్రెటరీలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్లాన్స్‌ తీసుకెళ్లి వారందరితో మాట్లాడి ఢిల్లీ పెద్దలతో చర్చించి మ్యాప్‌లో డిజైన్‌ చేయించాను. కేసీఆర్‌ ఆ గ్రామాలను తిరిగి లాక్కుంటాడని చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. అలా ఎందుకు ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. దానికోసం కేసీఆర్‌ అయినా, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ అయినా ఎవరైనా ఒకటే. మేం గౌరవం ఇస్తాం..గౌరవం పుచ్చుకుంటాం. మన రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికి జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ ముందుంటారు.         

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top