
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ వరకు పొడిగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రకటించారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రారంభించిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీతో ముగించాల్సి ఉందన్నారు.
అయితే నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాల్సి ఉన్నందున మరికొన్ని రోజులపాటు పొడిగించాలంటూ పలు నియోజకవర్గాల శాసనసభ్యులు, సమన్వయకర్తలు కోరుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 11వ తేదీ వరకు పొడిగించినట్టు ఆయన తెలిపారు. పోలింగ్ బూత్ పరిధిలో ఆయా బూత్ కమిటీ సభ్యులకు నిర్దేశించిన కుటుంబాలన్నింటినీ అక్టోబర్ 11వ తేదీ నాటికి సందర్శించి, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.