సైనికుల్లా దూసుకెళ్దాం: వైఎస్ విజయమ్మ | Ys vijayamma calls party leaders to go ahed as soldiers | Sakshi
Sakshi News home page

సైనికుల్లా దూసుకెళ్దాం: వైఎస్ విజయమ్మ

Feb 26 2014 2:45 AM | Updated on Jul 25 2018 4:07 PM

వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో యుద్ధంలో సైనికుల మాదిరిగా ముందుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

* వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వైఎస్ విజయమ్మ పిలుపు
* ప్రతి ఓటూ, ప్రతి నిమిషం కీలకం.. వృథా చేయొద్దు
* పార్టీపై చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టండి
* చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించండి
* ఉత్తమ ముఖ్యమంత్రి వైఎస్సేనని తెలంగాణలో 63 శాతం మంది చెప్పారు
* వైఎస్ ఆశయాలను 2 రాష్ట్రాల్లోనూ సాధించుకుందాం
 సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో యుద్ధంలో సైనికుల మాదిరిగా ముందుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క నిమిషం కూడా వృథా చేయరాదని సూచించారు. రానున్న సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన రెండు రోజుల చర్చా వేదిక కార్యక్రమంలో మొదటిరోజైన మంగళవారం విజయమ్మ ప్రారంభ, ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీజీసీ సభ్యులు, సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. పలువురు సీనియర్ నేతలు ప్రసంగించారు. సమావేశంలో విజయమ్మ ఏమన్నారంటే...
 
 - ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులందరూ ఒక ప్రణాళిక రూపొందించుకొని, దానికి అనుగుణంగా పనిచేశామా? లేదా? అనేది ఆరోజు రాత్రికి మననం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలను పక్కకు పెట్టి అనుబంధ సంస్థలన్నింటితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీపై చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. పార్టీ ప్లీనరీలో జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారనే నమ్మకం, ధైర్యం ప్రజల్లో ఉంది కాబట్టి వాటిని కూడా గుర్తుచేయాలి. మాట తప్పడమంటే ప్రాణం పోవడంతో సమానమని భావించే వైఎస్ కుమారుడిగా జగన్ కూడా అవే విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడ్డారు.

 - ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అయితే ఆయనను ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. చంద్రబాబు వెయ్యి ఇస్తానన్నా, రెండు వేలు ఇస్తానన్నా నమ్మడం లేదు. చంద్రబాబు హయాంలో చేసిన తప్పిదాలన్నీ ప్రజలకు మరోసారి గుర్తుచేయాలి. అలాగే నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, పాలనా వైఫల్యాలను కూడా పార్టీ శ్రేణులంతా గ్రామాల్లో వివరించండి.

 - ఎన్టీఆర్ హయాంలో గాని, రాజశేఖరరెడ్డి ఉన్నపుడు గాని ప్రాంతీయ ఉద్యమాలు లేవు. వైఎస్ చనిపోయిన తరువాత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. తెలుగుప్రజలు ఒక్కటిగా, బలమైన రాష్ట్రంగా ఉండి అభివృద్ధి చెందాలని రాజశేఖరరెడ్డి అభిప్రాయపడేవారు. ఆయన ఆశయాలను రెండు ప్రాంతాల్లోనూ సాధించుకుందాం.
 - రెండు ప్రాంతాల్లోనూ సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకుంటే జాతీయ స్థాయిలో పార్టీకి అంత విలువ పెరుగుతుంది. నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలి.

 - ముఖ్యంగా తెలంగాణ సోదరులు అధైర్యపడొద్దు. ఇటీవల వెలువడిన సర్వేలలో రాజశేఖరరెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అని సీమాంధ్రలో 53 శాతం మంది పేర్కొనగా, అదే తెలంగాణలో 63 శాతం రావడం జరిగింది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా వద్దు. తెలుగువారందరూ ఒక్కటే.
 - ‘మేం కేవలం తెలంగాణ నినాదం మీదనే పోరాడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం విషయంలో మాకంటే కూడా ప్రజల్లో మీకే ఎక్కువ ఆదరణ ఉంద’ని నాకు అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలు తారసపడినప్పుడు చెబుతుండేవారు. కనుక మీరు ధైర్యంగా పోరాడండి. మీ అందరి వెంట మేం అండగా ఉంటాం. నేను, జగన్, షర్మిల ముగ్గురం కూడా ప్రతీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తాం.
 - వైఎస్సార్‌సీపీ కష్టాల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ, బయటా పోరాడాం. పార్లమెంటులో కూడా అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోయి విభజన బిల్లును ఆమోదింప జేసుకున్నాయి.
 - విభజన బిల్లు పార్లమెంటులో వచ్చినపుడు మన రాష్ట్ర ఎంపీలు తమ స్థానాల్లో నుంచి లేవకుండా చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఏఐడీఎంకే, తృణమూల్ ఎంపీలు చివరికంటా ప్రతిఘటించారు. వైఎస్సార్‌సీపీకి ప్రజా బలం ఉన్నా తగినంత మంది ఎంపీల బలం లేకుండా పోయింది. అయినప్పటికీ శాయశక్తులా పోరాటం చేశాం.
 - రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగింది. సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఎక్కడో కూడా చెప్పకుండా చేశారు. విభజన వల్ల ఈ ప్రాంతంలో ఉత్పన్నమయ్యే లోటును ఎక్కడి నుంచి పూరిస్తారో కూడా చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement