ఫలిస్తున్న వైఎస్ విద్యుత్ యజ్ఞం! | YS Rajasekhara Reddy Vidyut Yagnam to be Succeed | Sakshi
Sakshi News home page

ఫలిస్తున్న వైఎస్ విద్యుత్ యజ్ఞం!

Aug 14 2013 1:27 AM | Updated on Jul 7 2018 2:52 PM

రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విద్యుత్ యజ్ఞం ఫలితాలనిస్తోంది.

** కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటులో బాయిలర్ లైటప్
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విద్యుత్ యజ్ఞం ఫలితాలనిస్తోంది. ఇప్పటికే విజయవాడ, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని పాల్వంచ వద్ద 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇదే బాటలో నెల్లూరు జిల్లాలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో కూడా అక్టోబర్ చివరినాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3.13 నిమిషాలకు బాయిలర్‌లో లైటప్ చేశారు. బాయిలర్, టర్బైన్ల పనితీరును వివిధ దశల్లో పరిశీలించిన అనంతరం అక్టోబర్ చివరినాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారతదేశంలోనే ప్రభుత్వరంగంలో నిర్మించిన మొదటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంటు ఇదే కావడం గమనార్హం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలో నిర్మించిన మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు కూడా ఇదే.

మరో 800 మెగావాట్లూ సిద్ధం
నెల్లూరు జిల్లాలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులను వైఎస్ హయాంలో ప్రారంభించారు. 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తూ.. ఈ ప్లాంటుకు దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంటుగా 12 డిసెంబర్ 2007లో ప్రభుత్వం నామకరణం చేసింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంటుకు 70 శాతం బొగ్గు ఒడిశాలోని తాల్చేరు నుంచి, మిగిలిన 30 శాతం బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

మొదటి 800 మెగావాట్ల ప్లాంట్‌లో అక్టోబరు నెలాఖరులో ఉత్పత్తి ప్రారంభంకానుండగా... మరో 800 మెగావాట్ల ప్లాంట్ పనులు కూడా పూర్తికావచ్చాయి. ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి జనవరి చివరినాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలో చేల్పూరు వద్ద 600 మెగావాట్ల  ప్లాంటులో మార్చి చివరినాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.
 
 అక్టోబర్ చివరినాటికి విద్యుత్ ఉత్పత్తి: విజయానంద్
కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తిని అక్టోబర్ చివరినాటికి ప్రారంభిస్తామని జెన్‌కో ఎండీ విజయానంద్ తెలిపారు. కృష్ణపట్నం మొదటి దశ 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో బాయిలర్‌లో లైటప్ చేశామని... వివిధ పరీక్షల అనంతరం అక్టోబర్ నాటికి కచ్చితంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వరుసగా 76 గంటల పాటు ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే... అప్పుడు వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ)ని ప్రకటిస్తామని విజయానంద్ ‘సాక్షి’కి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement