జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం 

YS Rajasekhara Reddy 71th Birth Anniversary Special Story On Irrigation - Sakshi

వైఎస్సార్‌ హయాంలో పరుగులు పెట్టిన అభివృద్ధి 

రూ.400 కోట్లతో సాగర్‌ కాలువల ఆధునికీకరణ 

రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్‌ 

కందుకూరులో రూ.110 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు

కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని     పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై      దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు.  వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. 

సాక్షి, ఒంగోలు‌: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక  జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. 

వెలిగొండ ప్రాజెక్టు.. 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు,  వైఎస్సార్‌ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు.

మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.  ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్‌ అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు.  

వైఎస్‌ జగన్‌తో మళ్లీ పనుల్లో వేగం.. 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్‌ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్‌కు నిర్వహించిన రివర్స్‌ టెండర్‌లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్‌ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్‌ ఆఖరుకు ఆ టన్నెల్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్‌కు నీళ్లు వదలనున్నారు.  

గుండ్లకమ్మ ప్రాజెక్టు... 
గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన  వైఎస్సార్‌ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్‌ 24న  డాక్టర్‌ వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.   

కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం:  
యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కూడా వైఎస్సార్‌ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్‌ అకాల మరణం చెందిన తరువాత  ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ప్రారంభమయ్యాయి. 

పాలేరు రిజర్వాయర్‌.. 
కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు  వైఎస్సార్‌ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో  9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. 

రూ.400 కోట్లతో సాగర్‌ కాలువల అభివృద్ధి: 
జిల్లాలో ఆయకట్టుకు సాగర్‌ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్‌ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్‌ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్‌ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్‌ కాలువల అభివృద్ధితో సాగర్‌ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు.  

రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్‌..  
జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్‌ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్‌ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్‌ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్‌ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు.   

కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్‌ఎస్‌ ట్యాంకు..  
కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్‌ఎస్‌ ట్యాంకులను నింపుతున్నారు.

రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి:  
రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్‌ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు.  

కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం:  
కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్‌ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్‌ నివారణ కోసం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top