ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి సాయం అందించండి

YS Jaganmohan Reddy Review Meeting About Plight Of Telugu People Other States - Sakshi

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు..

సాక్షి, తాడేపల్లి : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి, తీర్థయాత్రల కోసం వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు ప్రజలకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తెలుగువారికి సాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

► వారణాసిలోని 16 ఆశ్రమాల్లో ఏపీకి చెందిన 400 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో.. కోవిడ్‌-19 స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు యూపీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి సాయం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో యూపీ ఎక్సైజ్‌ కమిషనర్‌ గురుప్రసాద్‌ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు చేపట్టి.. ఏపీ యాత్రికులకు రేషన్‌, నిత్యావసర సరుకులు అందజేశారు.  
► 
గోరఖ్‌పూర్‌లో గుంటూరు జిల్లాకు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు.. యూపీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి రేషన్‌, నిత్యావసర సరుకులు అందేలా చూశారు. 
► రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌లో చిక్కుకున్న 21 మంది కర్నూలు వాసులకు.. సీఎస్‌, నోడల్‌ ఆఫీసర్‌ జోక్యంతో రేషన్‌ సరకులు పంపిణీ జరిగింది. 
► తమిళనాడు తీర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 500 మంది మత్య్సకారులు చిక్కుకుపోవడంతో.. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి వారికి రేషన్‌, నిత్యావసర సరుకులు అందేలా చూశారు. 
► గోవాలోని మద్గావ్‌ సమీపంలో చిక్కుకున్న 25 మంది వైఎస్సార్‌ జిల్లా యాత్రికులకు స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం సాయంతో ఆహారం అందజేశారు.
► గుజరాత్‌ వెరవాల్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన 1200 మంది శ్రీకాకుళం వాసులకు తక్షణ సాయం అందజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వం వారికి రోజు విడిచి రోజు 2 కిలోల బియ్యం, కిలో పప్పు అందజేస్తుంది. వారి సహాయక కార్యక్రమాలను స్పెషల్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర పర్యవేక్షిస్తున్నారు. 
► తమిళనాడులోని కోయంబత్తూరులో ఉపాధి నిమిత్తం వెళ్లి లాక్‌డౌన్‌ అక్కడే చిక్కుకుపోయిన 300 మంది ఏపీ కార్మికులకు బియ్యం, గోధుమలు అందిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
► ముంబైలో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 500 మంది కార్మికులకు.. ముంబై అదనపు మున్సిపల్‌ కమిషనర్‌ సహాయంతో 15 రోజులకు సరిపడ రేషన్‌ పంపిణీకి ఏపీ​ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top