త్వరలోనే తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర: గట్టు

త్వరలోనే తెలంగాణలో జగన్ ఓదార్పుయాత్ర: గట్టు - Sakshi


 ఖమ్మంలో బహిరంగ సభ,


 తర్వాత   ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర


 తెలంగాణలో మా పార్టీ బలహీనపడిందన్నది అవాస్తవం: గట్టు


 జగన్‌పై చంద్రబాబు విమర్శలు ఆకాశంపై ఉమ్మేయడమే


 హరీశ్‌రావు, మధుయాష్కీకి జగన్ ఫోబియా


 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం  జరిగిన తెలంగాణ పది జిల్లాల శాసనసభా నియోజకవర్గ సమన్వయకర్తల, ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించాలని జగన్ ఓదార్పు యాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికి ఓదార్పు యాత్ర పూర్తయింది. మిగతా జిల్లాల్లో కూడా ఓదార్పు యాత్ర చేస్తారని, ఎప్పటినుంచి అనేది త్వరలో తేదీలను ప్రకటిస్తామని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.మరో అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావుతో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పది జిల్లాల నేతలతో సమావేశమై పనితీరును విడివిడిగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమీక్షించారని తెలిపారు. తొలుత ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారని, ఆ తరువాత ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తారని తెలిపారు. అంతకుముందు గుంటూరు జిల్లాలో ఇంకా మిగిలిపోయి ఉన్న ఓదార్పు యాత్రను పూర్తిచేస్తారన్నారు. తెలంగాణలో తాను పర్యటించబోతున్నానని జగన్ చెప్పగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోందని తెలిపా రు. ఇంకా ఏమన్నారంటే...


  •   తెలంగాణలో మా పార్టీ బలహీనపడిందని ఓ వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ర్పచారంలో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణలో 63 శాతం మంది వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అనే అభిప్రాయంతో ఉన్నారని ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

  •   విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ పునర్నిర్మాణం చేసే శక్తి తనకే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం విడ్డూరం. ముఖ్యమంత్రిగా ఇరు ప్రాంతాలను సర్వనాశనం చేసిన ఘనత ఆయనదే. జగన్‌కు అధిష్టానం టెన్ జన్‌పథ్ అని చంద్రబాబు విమర్శించడం సరికాదు. అసలు చంద్రబాబుకు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరికీ సోనియాగాంధీయే అధిష్టానవర్గం.

  •   పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించడమే కాక, కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ ఆదుకున్న దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ఆకాశమ్మీద ఉమ్మేస్తే అది తన మీదే పడుతుందన్న వాస్తవం బాబు గ్రహించాలి.

  •   విభజన వ్యవహారంలో తనది ఏ వైఖరి అని చెప్పకుండా తప్పించుకున్న చంద్రబాబువి ద్వంద్వ ప్రమాణాలు. జగన్ అధికారంలోకి వస్తే మరో జైలు నిర్మిస్తాడని చంద్రబాబు చెప్పడమేంటి? హైటెక్ సిటీ టెండర్లు ఇచ్చినందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు (పార్టీ కార్యాలయ భవనం), సొంత ఇల్లు నిర్మించుకున్న ఘనత చంద్రబాబుది.

  •   టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మా అధినేత జగన్ అంటే భయపడుతున్నారు. అందుకే ఆయనను తెలంగాణలో పర్యటించరాదని ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకు పర్యటించకూడదు? జగన్ తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నారు. అది తప్పేమీ కాదు. టీఆర్‌ఎస్ కూడా ఆంధ్రా ప్రాంతంలో శాఖ ప్రారంభించుకుంటే వద్దన్నదెవరు?

  •   ఓదార్పు గురించి జగన్‌కు తెలుసా అని అంటున్న హరీశ్ రావు, ఆయన మామ కేసీఆర్ కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు ఎపుడైనా వెళ్లి ఓదార్చారా?

  •   జగన్ తెలంగాణకు వస్తే మానుకోట పునరావృతం అవుతుందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ చెప్పడమంటే ఆయనకు జగన్ ఫోబియా పట్టుకుందనేది అర్థమమవుతోంది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top