రైతులను ఆదుకోండి

YS Jagan Mohan Reddy Orders Officials To Help Farmers To Sell Crops In Market Yards - Sakshi

బహిరంగ మార్కెట్‌లో పంటను అమ్ముకునేందుకు పూర్తిగా సహకరించాలి

రైతులకు రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలి: సీఎం వైఎస్‌ జగన్‌

మూడో దఫా కుటుంబ సర్వే పరిధి మరింత విస్తృతం

ప్రతి కుటుంబ ఆరోగ్య వివరాలు నమోదు చేయాలి

తొలి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలతో ఉన్న 6,289 మందిని మూడో సర్వేలోనూ విచారించాలి

ఆస్తమా, బీపీ, సుగర్‌ వ్యాధితో బాధ పడుతున్న వారిని కూడా ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకోవాలి

మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారే కాకుండా, వైరస్‌ లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయించాలి

ఢిల్లీ ఎఫెక్ట్‌ తగ్గుతోందని వివరించిన అధికారులు

ధాన్యం, మొక్క జొన్న పంట చేతికి వస్తోంది. కొనుగోలు కేంద్రాలకు రవాణా కోసం ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. రవాణాలో నిల్వ చేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మిర్చి మార్కెట్‌ యార్డులను రెడ్‌జోన్, హాట్‌ స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేయాలి.

ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని.. అవసరమైతే లారీల వాళ్లతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి ఒప్పించాలి. ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. పంటలను మార్కెట్లకు తరలించి రైతులకు న్యాయం చేయాలి.

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో బయటి మార్కెట్‌లో తమ పంటలను అమ్ముకోవాలనుకునే రైతులకు పూర్తిగా సహాయ, సహకారాలు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారికి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మార్కెటింగ్‌ పరంగా మరింత దూకుడుగా వ్యవహరించి, తోడ్పాటు అందించాలన్నారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు గత రెండు సర్వేలు జరిగిన తీరు తెన్నులు, ఇప్పుడు జరుగుతున్న మూడో సర్వేపై, రైతుల పంటల కొనుగోలు అంశాలపై గురువారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు కావాలి. అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. దీనిపై నిశితంగా సమీక్ష చేయాలి. ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి: సీఎం వైఎస్‌ జగన్‌

► కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నందున పంటల రవాణా, మార్కెటింగ్‌ పరిస్థితి కష్టంగా ఉంది. 50 శాతం మార్కెట్లు మూత పడ్డాయి. 20 శాతం మార్కెట్లలో కూడా లావాదేవీలు జరగడం లేదు. 
► ఇదిలా ఉంటే రవాణా ఇంకో సమస్య. లారీల వాళ్లు రావడం లేదు. కరోనా భయం కావచ్చు.. రోడ్డుపైకి వస్తే పోలీసులు ఆపేస్తారని కావచ్చు.. లోడ్‌ ఎత్తుకోవడానికి ముందుకు రావడం లేదు. అయినప్పటికీ మనం రైతులకు సహకరించాలి. ఎలాగైనా వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. 
► ఉత్పత్తి ఉన్న చోటే మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేయాలి. రైతులను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగాలన్న ఉద్దేశం నెరవేరేలా చూడాలి.

ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి నమోదు కావాలి
► ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. 
► మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మందిని కూడా మూడో దపా సర్వేలో భాగం చేయాలి. 
► ఆస్మా, బీపీ, సుగర్‌ వ్యాధితో బాధ పడుతున్న వారిని కూడా ఇందులోకి తీసుకొస్తూ మూడో దపా సర్వే పరిధిని మరింత విస్తృతం చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారికి కనుక కరోనా వైరస్‌ సోకితే పరిస్థితి సీరియస్‌ అవుతుంది. అందువల్ల ఇలాంటి వారందరి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మూడో విడత సర్వేను కట్టుదిట్టంగా కొనసాగించాలి. 
► మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా, వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు చేయించాలి. ఎక్కడా తప్పు జరగడానికి అవకాశం లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి.
► క్వారంటైన్లలో సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉండాల్సిందే.

చర్చకు వచ్చిన అంశాలు
► ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారి వివరాల సేకరణలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరు ప్రశంసనీయం.  
► రాష్ట్రంలోని కుటుంబాల వారీగా మొదటి, రెండు దపా సర్వేపై సీఎం ఆరా. మూడోసారి ప్రారంభమైన సర్వే మరింత కట్టుదిట్టంగా, సమగ్రంగా జరగాలని సీఎం ఆదేశం. 
► భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీలను చేర్చి, అదనపు ప్రశ్నలను సర్వేలో జోడించామని అధికారులు వివరించారు.

ఇదీ పరిస్థితి..
► సమీక్షా సమావేశానికి ముందు దేశంలో కోవిడ్‌ విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాల గురించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి సీఎంకు వివరించారు.
► ఢిల్లీ వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అధికారులు సీఎంకు వివరించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన, వారి ప్రైమరీ కాంటాక్టుల పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ.. ఈ కేసుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు.
► సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇప్పటికే ఇలా..
► రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్లలో విక్రయించేలా ఏర్పాట్లు పూర్తి.
► స్వయం సహాయక సంఘాల ద్వారా అరటి పళ్ల విక్రయం ప్రారంభం.
► క్రమంగా చీనీ లాంటి పంటనూ స్థానికంగా విక్రయించేందుకు ఏర్పాట్లు ముమ్మరం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top