గిరిజన రైతులకూ పంట రుణాలు!

YS Jagan Mohan Reddy Give Crop Loans To Tribal Farmers - Sakshi

రైతులతో సమానంగా పోడు వ్యవసాయదారులకు హక్కులు, ప్రభుత్వ పథకాలు

అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి పునరుజ్జీవం

ప్రభుత్వ ఆదేశాలతో పక్కా ప్రణాళిక రూపొందించిన గిరిజన సంక్షేమ శాఖ

సాక్షి, అమరావతి: అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పునరుజ్జీవింపచేసి.. వాస్తవ ప్రయోజనాలను గిరిజన రైతులకు చేరువ చేసేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భూమిపై టైటిల్‌ పొందిన గిరిజన రైతులకు ఇతర రైతులతో సమానంగా అన్ని ప్రయోజనాలు, ప్రభుత్వపరమైన లబ్ధి చేకూరేలా గిరిజన సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసింది. దీనివల్ల అటవీ హక్కుల చట్టం ప్రకారం టైటిల్‌ పొందిన రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు మైదాన ప్రాంతాల్లోని రైతులతో సమానంగా పూర్తి హక్కులు పొందగలిగేలా వ్యవస్థ రూపుదిద్దుకోనుంది.

అపహాస్యం పాలైన అటవీ హక్కుల చట్టం
అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తిని, మౌలిక ఉద్దేశాన్ని గత ప్రభుత్వాలు కాలరాసిన ఫలితంగా ఎస్టీ, ఇతర సంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 (నెం.2/2007) అపహాస్యమైంది. అడవిలో నివసించే ప్రజల హక్కులను గుర్తించాలనే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో ఆమోదం పొందింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అన్ని అటవీ ప్రాంతాలకు వర్తింపచేశారు. గిరిజనులను గుర్తించి వారికి భూమిపై టైటిల్‌ హక్కును ఇచ్చారు. అయితే, వారికి భూమి ఉన్నా దానిపై రుణం రావటం లేదు. ఏ ప్రభుత్వ పథకం కింద గిరిజన రైతులకు లబ్ధి చేకూరటం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాదాపు 96 వేల మంది గిరిజనులు భూమి పొందినా, వారిలో ఐదు శాతం మందికి  కూడా సగటు రైతులకు లభించే హక్కులను పొందలేకపోతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు భూమిపై అన్ని హక్కులు కల్పిస్తూ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అటవీ హక్కుల చట్టం అమలుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫలితంగా పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులు, ప్రభుత్వ పథకాలు లభిస్తాయి. ఇకపై బ్యాంకులు సైతం గిరిజనులకు పంట రుణాలు అందిస్తాయి. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top