నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..

YS Jagan Launch Jagananna Vasathi Deevena Scheme - Sakshi

 పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే..

‘జగనన్న వసతి దీవెన పథకాన్ని’ ప్రారంభించిన సీఎం జగన్‌

సాక్షి, విజయనగరం: దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని.. నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. ఇంటర్ తర్వాత కళాశాలలో చేరేవారి సంఖ్య రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైన్ దేశాలలో 50 శాతం ఉండగా ఇండియాలో కేవలం 23 శాతం మాత్రమే ఉందన్నారు. ఇటువంటి పరిస్ధితులు ఉంటే కుటుంబాలు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం అన్నారు. (వసతి దీవెనపథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్)

‘పేద విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20వేలు వసతి దీవెన అందిస్తాం. డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థులకు రెండు విడతలుగా రూ.20వేలు ఇస్తాం వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు అందిస్తాం. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఇస్తామని’  సీఎం  తెలిపారు. 1 లక్ష 87వేల మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. వసతి దీవెన  కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికే ఈ వసతి దీవెన పథకం అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యా దీవెన పథకం కింద  ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ రెండు పథకాలతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నామన్నారు. మన బడి- నాడు నేడు ద్వారా 45 వేల  ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల రూపురేఖలు మారతాయన్నారు. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే అని సీఎం తెలిపారు. (రూ.600 కోట్లతోజగనన్న విద్యా కానుక)

తెలుగును తప్పనిసరి చేస్తూనే ఈ ఏడాది జూన్ నుంచి ప్రతీ పాఠశాలలో ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించబోతున్నామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్ధాయిలో పోటీ పడేలా ఉండాలన్నారు. ‘పేద, మధ్యతరగతి పిల్లల కోసం ఆలోచించే ప్రభుత్వం మనది. మహిళా సాధికారికతకు కట్టుబడిన ప్రభుత్వం మనది. దశల వారీ మద్య నిషేధం ద్వారా జీవితాలలో మంచి మార్పులు వస్తాయని’  తెలిపారు. (చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు)

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..
‘పేదల సంక్షేమం‌ కోసం శ్రమిస్తున్న మా ప్రభుత్వంపై కొందరు నిత్యం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో 25 లక్షల‌ మంది‌ నిరుపేదలకి రికార్డు స్థాయిలో ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికలు, మీడియాల తప్పుడు ప్రచారాన్ని ఏమనాలి. చంద్రబాబును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికలు, ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇందుకు దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలి. రాష్ట్రంలో ఉంది.. ప్రతిపక్షం కాదు..రాక్షసులు’ అని సీఎం జగన్‌ విమర్శించారు. (విద్యా విప్లవానికి శ్రీకారం)

‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌..
పోలీస్‌ బేరక్స్‌లో నిర్మించిన దిశ పోలీస్‌స్టేషన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మహిళల భదత్ర, సత్వర న్యాయం జరగాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top