
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వసతి దీవెన’పథకాన్ని సోమవారం ఆయన విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్ విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించించారు. అనంతరం వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు.
వైఎస్ జగన్ తండ్రికి మించిన తనయుడు
విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజలు వైఎస్ జగన్‌ని తండ్రికి మించిన తనయుడిగా భావిస్తున్నారన్నారు. అమ్మఒడి, ఆరోగ్య పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసాతో జిల్లాలో వలసలు ఆగిపోయాయన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది కళ్లలో ఆనందం నింపారన్నారు. జగనన్న పథకాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని కోలగట్ల విమర్శించారు.