‘ఆర్భాటాలకు పోకుండా నిర్మాణాలు చేపట్టాలి’

YS Jagan Holds Review Meeting Over CRDA - Sakshi

సాక్షి, అమరావతి : సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఆర్‌డీఏపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మినరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా ప్రాధాన్యత క్రమంలో పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల విషయంలో అనవసర ఖర్చులకు పోకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తి కావొస్తున్న నిర్మాణాలపై ముందు దృష్టిపెట్టాలని.. ఇందుకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్‌ స్పష్టం చేశారు. పనుల నిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌ వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని తెలిపారు.

సీఆర్డీఏ పరిధిలో రోడ్ల డిజైన్‌ల గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులు ఉండకూడదని సూచించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో, ఖర్చు, డిజైన్ల తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సమీపంలో కొండవీటివాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. అలాగే వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగంపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్‌ స్కేపింగ్‌ చేసి సుందరీకరించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో వ్యయం తగ్గించి.. మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి.. వారికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top