రామ్మోహన్‌ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం | YS Jagan Government pays Rs 7 lakh to farmer Rammohan Family | Sakshi
Sakshi News home page

రైతు రామ్మోహన్‌ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం

Jul 17 2019 6:18 PM | Updated on Jul 17 2019 8:02 PM

YS Jagan Government pays Rs 7 lakh to farmer Rammohan Family - Sakshi

సాక్షి, కడప : అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు పంతగాని రామ్మోహన్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆపన్న హస‍్తం అందించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు భార్య నాగరత్నమ్మకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం అందించింది. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ బుధవారం రైతు రామ్మోహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం యావత్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందచేశారు.

కాగా చిట్వేలు మండలం నాగవరం హరిజనవాడకు చెందిన రామ్మోహన్‌ సోమవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి మూడు ఎకరాల భూమి ఉంది. బొప్పాయి, అరటి పంటలను సాగు చేసుకుంటూ ఉండేవాడు. ఏటా ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తినడం, గిట్టుబాటు ధరలేక నష్టపోయాడు. ఆర్థికంగా దెబ్బతినడంతో మానసికంగా దిగులుపడుతూ ఉండేవాడు. అంతేకాకుండా నీటి సౌకర్యం తక్కువగా ఉండేది. బోరులో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో చిట్వేలిలోని సహకార బ్యాకులో లక్ష రుణం, నాగవరం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయల రుణం, గ్రామంలో ఓ రైతు వద్ద మరో లక్ష తీసుకుని మూడు బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేక పంట పూర్తిగా ఎండిపోవడంతో ఆవేదన చెంది మొన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్మోహన్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement