 
															పెళ్లైన రెండు నెలలకే..
వివాహమైన రెండు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ముత్తుకూరులో బుధవారం...
	యువకుడి ఆత్మహత్య
	 
	ముత్తుకూరు : వివాహమైన రెండు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ముత్తుకూరులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. స్థానిక చలివేంద్ర రోడ్డులోని పాత దళితవాడకు చెందిన దుంపల నరసింహులుకు గురుకుల పాఠశాల వద్ద కట్టెల దుకాణం ఉంది. పెద్ద కొడుకు శంకర్ (29) వరగలి వద్ద రొయ్యల పెంపకం చేస్తున్నాడు. అర్ధరాత్రి శంకర్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కట్టెల దుకాణానికి వచ్చి అక్కడ ఉన్న పూరింట్లో చీరెతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కట్టెల దుకాణం వద్దకు వచ్చిన నరసింహులు పూరిల్లు కొయ్యకు కొడుకు శంకర్ ఉరేసుకుని ఉండాటాన్ని గమనించగా అప్పటికే మృతి చెందాడు. మృత దేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. మృతుడి జేబులోని లభించిన ఉత్తరాన్ని పోలీసులకు అందజేశాడు.  
	
	
	 కొందరి వేధింపు వల్లే..
	 అయితే శంకర్ కొందరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోర్టుకు చెందిన ఓ ఉద్యోగి, చిల్లకూరుకు చెందిన పోలీసు అధికారి, వరగలి మాజీ సర్పంచ్, మరో ఆరుగురు గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో వీరంతా తనను తీవ్ర మనోవేదనకు గురి చేశారని, తన ఆత్మహత్యకు వీరే కారణమని అందులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరుపుతామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
