తిమ్మాపురం గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల విద్యార్థుల బాధ్యత తమదేనని వారి తల్లిదండ్రులకు అధికారులు భరోసా ఇచ్చారు. ముగ్గురు విద్యార్థులను
తిమ్మాపురం (కాకినాడ రూరల్) :తిమ్మాపురం గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల విద్యార్థుల బాధ్యత తమదేనని వారి తల్లిదండ్రులకు అధికారులు భరోసా ఇచ్చారు. ముగ్గురు విద్యార్థులను కరస్పాండెంట్ విచక్షణారహితంగా కొట్టిన దారుణ ఘటన వెలుగుచూడడంతో తమ పిల్లలను తీసుకువెళ్లిపోవడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారులు సమావేశం నిర్వహించారు.
విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటామని ఎంపీడీవో సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి, తహశీల్దార్ జె.సింహాద్రి, ఎంఈవో ఎస్.విజయలక్ష్మిదేవి హామీ ఇవ్వడంతో పిల్లలను అక్కడే ఉంచేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పాఠాలు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను, ఆటపాటలు నేర్పేందుకు మరో ఉపాధ్యాయుడ్ని అధికారులు నియమించారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, డీఈవో కేవీ శ్రీనువాసులురెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులను తరగతుల వారీ ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు నమోదు చేశారు. పాఠశాలలో ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని అధికారులు తెలిపారు.
‘గ్రీన్‌ఫీల్డ్’ను సందర్శించిన జెడ్పీ చైర్మన్
గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలను జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జెడ్పీ సీఈవో భగవాన్‌దాస్, డీఈవో కేవీ శ్రీనువాసులురెడ్డి మంగళవారం సందర్శించారు. ముగ్గురు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడంపై విచారణ జరుగుతుందని, ప్రభుత్వ ఆధీనంలో పాఠశాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మన్ రాంబాబు చెప్పారు. విద్యార్థులను పరామర్శించారు.