
తనపై దాడి చేసిన టీడీపీ వారితోనే చాగలమర్రి ఈవోపీఆర్డీ సమావేశం
ఎంపీడీవో ఆఫీసులోనే టీ పార్టీ ఇచ్చి సారీ చెప్పాలని అధికారుల వేడుకోలు
ఆళ్లగడ్డ: ‘తన్నితే తన్నారులే.. చిన్న సారీ చెప్పండి చాలు.. అన్నీ సర్దుకుపోతాయి..’ అని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేతలను అధికారులు వేడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం అధికారిక సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని టీడీపీ గ్రామ స్థాయి నేత చల్లా నాగరాజు అనుచరులతో కలిసి చాగలమర్రి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ ఎంపీడీవో(ఈవోపీఆర్డీ) తాహీర్ హుస్సేన్‌ను బూతులు తిడుతూ దాడి చేశారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని చిన్న సంఘటనగా తీసుకుని ‘ఎమ్మెల్యే మేడం చెప్పారు..’ అంటూ శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులే టీడీపీ నేతలతో టీ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఎంపీడీవోపై దాడిచేసిన టీడీపీ నాయకులను రాచమర్యాదలతో కూర్చోబెట్టారు. ‘మీకు ఎలాంటి పదవి లేక పోయినా ఇక మీదట ప్రతి సమావేశానికి ఆహ్వానిస్తాం. మీరు చెప్పినట్లే నడుచుకుంటాం. ఈ విషయం మేడం దగ్గర కూడా ఒప్పుకున్నాం. పేపర్‌లో వచ్చినంత మాత్రాన దాడి జరగలేదు. దాడైతే జరిగిందని చెప్పాం. మీరు ఓ సారి సారీ చెప్పండి. ఇంతటితో వివాదం సద్దుమణిగిపోతుంది..’ అని టీడీపీ నాయకులను అధికారులు దండం పెట్టి వేడుకున్నారు.
అనంతరం టీడీపీ నేత నాగరాజు స్పందిస్తూ ‘మేడం చెప్పింది కాబట్టే నేను చెబుతున్నా. ఇక్కడున్న అధికారులకు అందరికీ తెలుసు నేనేంటో..’ అని ఆయన దాడి చేసిన అధికారివైపు కాకుండా వెనకున్న అధికారుల వైపు తిరిగి ‘అనుకోని ఘటన జరిగింది. మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్న ఆవేశంలో ఇలా చేయాల్సి వచ్చింది’ అని చెప్పాడు. అదే సమయంలో బాధిత అధికారి తాహీర్ హుస్సేన్ స్పందిస్తూ ‘దాడి చేసింది నామీద. కాబట్టి అదేదో నావైపు చూసి నాకు చెప్పాలి’ అని అనడంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది నవ్వుకున్నారు.