
ఆదాయం, జనాభా ఆధారంగా పంచాయతీల పునర్‌వర్గీకరణ
10 వేల జనాభా లేదా కోటి ఆదాయం ఉన్నవాటిని స్పెషల్‌గ్రేడ్‌గా గుర్తింపు
రాష్ట్రంలో మొత్తం 300 వరకు ఉంటాయని అధికారుల లెక్కలు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
సాక్షి, అమరావతి: పది వేల పైబడి జనాభా లేదా ఏడాదికి రూ.కోటికి పైబడి వార్షికాదాయం ఉండే గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించి, వాటికి డిప్యూటీ ఎంపీడీవోలను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో మండలం పరిధిలో ఉండే అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాలను పర్యవేక్షించే మండల స్థాయి అధికారి ఈవోపీఆర్ అండ్ ఆర్‌డీలను ప్రభుత్వం ఇటీవలే డిప్యూటీ ఎంపీడీవోలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను వాటి వార్షికాదాయం, జనాభా ఆధారంగా పునర్‌వర్గీకరించేందుకు ఈ ఏడాది జనవరిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ కమిటీ పది వేలపైబడి జనాభా ఉండే గ్రామ పంచాయతీలు, లేదంటే ఏడాదికి రూ.కోటికి పైబడి వార్షికాదాయం ఉండే పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించాలని, గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల పైబడి జనాభా ఉండే పంచాయతీని స్పెషల్ గ్రేడ్‌గా గుర్తించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో దాదాపు 300 గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు అర్హమైనవిగా గుర్తించింది. వీటిల్లో ప్రస్తుత పంచాయతీ కార్యదర్శుల స్థానంలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

మూడు గ్రేడుల్లో విలీనం..
గ్రామ పంచాయతీల పునర్‌వర్గీకరణకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలను మినహాయించి మిగిలిన గ్రామ పంచాయతీల మొత్తాన్ని గ్రేడ్ –1, 2, 3 పంచాయతీలుగా వర్గీకరిస్తూ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను గతంలో ఐదు గ్రేడ్‌లుగా వర్గీకరించారు. ఇప్పుడు తాజా మార్పులకు వీలుగా వీరిని గ్రేడ్ –1, గ్రేడ్ –2, గ్రేడ్ –3 పంచాయతీ కార్యదర్శులుగా వర్గీకరించి విలీనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ «కమిషనర్ కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆన్ని జిల్లాల నుంచి తగిన ప్రతిపాదనలు పంపాలంటూ కలెక్టర్లకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ సూచించింది.