హృదయవిదారకం; అమ్మా.. నన్ను క్షమించు అంటూ

Young Man Commits Suicide By Jumping Into Godavari River - Sakshi

గోదారిలో దూకిన ఇంజినీరింగ్‌ విద్యార్థి  

హృదయ విదారకంగా అమ్మకు రాసిన ఉత్తరం

అమ్మా.. నన్ను క్షమించు... బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను, చెల్లిని బాగా చూసుకోవాలనుకున్నాను. చెల్లికి పెళ్లి కూడా చేయాలనుకున్నాను. ‘నీ ఒడిలో మొదలైన నా ప్రయాణం..ఈ గోదారి తల్లి ఒడిలో ఆత్మహత్యతో సమాప్తం..’ ఐ లవ్‌ యూ అమ్మా.. వెళ్లిపోతున్నా... గుడ్‌ బై అంటూ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లికి లేఖ రాసి.. వైనతేయ గోదావరిలో దూకేశాడు. ఈ ఘటన అందరినీ కదిలించి వేసింది.
సాక్షి, అమలాపురం టౌన్‌/అల్లవరం: బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై ఉన్న వంతెనపై నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయ విదారకంగా ఉన్న ఆ విద్యార్థి.. అమ్మకు రాసిన ఆ ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. ఇక ఆ ఉత్తరాన్ని చదవి గుండె పగిలింది. ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామానికి చెందిన అమలాపురం రూరల్‌ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం బీటెక్‌ చదువుతున్న మట్టపర్తి యశ్వంత్‌ సాయి వీరేంద్ర (19) చదువుపై ఆసక్తి లేక.. కళాశాలకు చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేక మనస్తాపంతో వైనతేయ నది వంతెనపై నుంచి దూకాడు. అతడి ఆచూకీ కోసం పడవలపై గాలిస్తున్నారు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు.


వీరేంద్ర కోసం వైనతేయ నదిలో పడవపై గాలిస్తున్న ఎస్సై చిరంజీవి, పోలీసులు, గజ ఈతగాళ్లు

అమ్మే నన్ను, చెల్లిని ఏ లోటూ తెలియకుండా పెంచుతోంది. చదువు ఎక్కనప్పుడు... కళాశాలకు కట్టాల్సిన డబ్బులు చెల్లించలేక బాధతో గతంలోనే కళాశాల భవనం పైనుంచి దూకి చనిపోవాలనుకున్నాను. అమ్మ, చెల్లి గుర్తుకు వచ్చి మానేశాను. అంత సొమ్ము అమ్మ వద్ద లేదు. అమ్మ కూలి పనికి వెళుతోంది. తీవ్ర మానసిక ఒత్తిడి, జీవితంలో స్థిరపడలేకపోయానన్న మనోవేదన అతడిని కుంగదీశాయి. గతంలోనే ఆత్యాహత్యా యత్నం చేసినప్పటికీ విఫలమైందని అతడు ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. అల్లవరం ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసు బృందం, ఈతగాళ్లు బోడసుకుర్రు వద్ద వైనతేయ నదిలో ఉదయం నుంచి రాత్రి వరకూ పడవలపై గాలించినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కళాశాలలో సర్టిఫికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే ఆర్థిక స్థోమత లేక.. అమ్మకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో అతడు గోదావరిలోకి దూకాడని ఎస్సై తెలిపారు. యశ్వంత్‌ రాసిన ఉత్తరాన్ని చూసి తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వైనతేయ వంతెన వద్దకు యశ్వంత్‌ సైకిల్‌పై వచ్చాడు. ముందే అమ్మకు రాసుకున్న సుసైడ్‌ నోటును సైకిల్‌పై పెట్టి నదిలో దూకేశాడని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. అతని చెప్పులు, సెల్‌ఫోను అక్కడ కనిపించలేదు. అయితే ఉత్తరంలో మాత్రం తన అమ్మ సెల్‌ ఫోన్‌ నంబర్‌ను రాశాడు. ఈ ఉత్తరాన్ని పలువురు స్మార్ట్‌ ఫోన్ల వాట్సాప్‌లకు పంపారు. ఆ ఉత్తరం చదివిన వారి మనసులను కలచివేసింది. అతని మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top