
రహదారిపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ
గుంటూరు ,దోనేపూడి(కొల్లూరు) :ఆమెకు కష్టం వచ్చింది.. కన్నీళ్లు దిగమింగింది.. అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసింది.. జీవన భృతి పంపిణీలో పేరు చేర్చమని కోరింది.. ఎవరూ వినలేదు. కనీసం కనికరం చూపలేదు. అర్హత ఉన్నా పట్టించుకోలేదు. చివరికి ఓపిక నశించింది. మంగళవారం రోడ్డుపై పడుకుని నిరసనకు దిగింది. వివరాల్లోకిళ్లితే.. కొల్లూరు మండలంలోని దోనేపూడి గ్రామానికి చెందిన నూతక్కి లక్ష్మికుమారి గతంలో కిష్కిందపాలెంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పట్లోనే విభేదాల కారణంగా విడిపోయి తల్లితో కలిసి భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో నివసిస్తుంది.
తనకు ఒంటరి మహిళ పింఛన్ మంజూరులో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయం వద్ద రేపల్లె–తెనాలి ప్రధాన రహదారిపై పడుకొని తనకు పింఛన్ మంజూరు చేసేంత వరకు నిరసన విరమించేది లేదని భీస్మించింది. అధికారులు ఆమె రేషన్‌కార్డు తెనాలి అడ్రస్‌తో ఉండటం గమనించి తెనాలిలో దరఖాస్తు చేసుకోవాలని, లేనిపక్షంలో కార్డును ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలని సూచించినా వినలేదు. చివరకు కొల్లూరు పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు. ఆమె మానసిక పరిస్థితి సక్రమంగా లేదని పోలీసులు చెబుతున్నారు.