బాకీదారుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం

బాకీదారుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం - Sakshi


బద్వేలు అర్బన్ : అప్పు చెల్లించలేదని బాధిత కుటుంబ సభ్యురాలు బాకీదారుడి ఇంటి ముందు  ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కడప రిమ్స్‌కు తరలించారు.  అంతకుముందు ఆమె తన కుటుంబంతో కలిసి  స్థానిక ఆంజనేయనగర్‌లోని బాకీ దారుడి ఇంటిముందు బైఠాయించి ఆందోళన నిర్వహించింది.  ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని బోయనపల్లె గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామసుబ్బారెడ్డి అనే రైతు పట్టణంలో నివసిస్తున్న శివారెడ్డి(రామసుబ్బారెడ్డి సమీప బంధువు) అనే చీటీల వ్యాపారికి సుమారు రూ.12 లక్షలు అప్పుగా ఇచ్చారు.ఎంత తిరిగినా ఆయన చెల్లించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గతేడాది జనవరి 23న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అప్పట్లో మృతదేహంతో రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అనంతరం బాకీదారుడి ఇంటి ముందు శవ జాగారం చేశారు. పోలీసులు, పెద్ద మనుషులు పంచాయితీ చేసి ఆరు నెలల్లో డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేశారు. ఇందుకు నమ్మకంగా శివారెడ్డికి చెందిన ఇంటిని మృతుడి భార్య పేరు మీద అగ్రిమెంట్ చేశారు.అయితే 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి చెల్లించకుండా తమకు అగ్రిమెంట్ చేసిన ఇంటిని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని మృతుడి భార్య రామసుబ్బమ్మ, కుమారుడు రామక్రిష్ణారెడ్డి, కుమార్తె శ్రావణి బంధువులతో కలిసి శివారెడ్డి ఇంటిముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్‌ఐ నాగమురళి, రూరల్ ఎస్‌ఐ నరసింహారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని శివారెడ్డిని, అతని కుమారుడిని స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారం మైదుకూరు డీఎస్పీ వద్ద ఉందని అదుపులోకి తీసుకున్న వారిని డీఎస్పీ వద్దకు పంపుతామని.. మీరు కూడా అక్కడకు వెళ్లి మాట్లాడండి అని బాధితులకు తెలిపారు.అయితే వారు అక్కడి నుంచి కదలలేదు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటామని బాకీదారుడి ఇంటిముందే బైఠాయించారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో మృతుడి కుమార్తె శ్రావణి బాకీదారుడి ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బంధువులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కడప రిమ్స్‌కు తరలించారు.ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ‘18 నెలలుగా తండ్రిని పోగొట్టుకుని రావలసిన బాకీ డబ్బుకోసం పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదు. జిల్లా ఎస్పీ , డీఎస్పీ వద్దకు వెళ్లి  సమస్యను చెప్పినా పరిష్కరించలేకపోయారు. చివరకు పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో శివారెడ్డి(బాకీదారుడు) మాకు రాయించిన ఇంటిని కూడా వేరేవారికి రిజిస్టర్ చేయించారు. మా కుటుంబాన్ని వీధి పాలు చేశారు. ఇక న్యాయం జరగదని నా తండ్రిలాగే నేను చనిపోదామని ఆత్మహత్య చేసుకున్నాన’ని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top