నా భర్తను అతను దారుణంగా మోసం చేశారు 

Women Gave Complaint To District Collector About How His Husband Cheated By Arunachalam Reddy - Sakshi

సాక్షి, కర్నూలు : నగరంలోని ప్రతిభ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో భాగస్వామ్యం మీద 18 సంవత్సరాలుగా పని చేస్తున్న తన భర్త సీవీఆర్‌ మోహన్‌రెడ్డిని అరుణాచలంరెడ్డి అక్రమంగా తొలగించారని ఆయన భార్య జయమ్మ జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ప్రతిభ ఎడ్యుకేషనల్‌ సొసైటీని 2000 సంవత్సరంలో అరుణాచలంరెడ్డి, సీవీఆర్‌మోహన్‌రెడ్డి, షేక్‌ షంషుద్దీన్, ప్రసాదు, చంద్రశేఖర్‌ కలిసి ప్రారంభించారన్నారు.

తన భర్తను సొసైటీకి డైరక్టర్‌గా నియమించారన్నారు. ఆయన నేతృత్వంలో అనతికాలంలోనే ప్రతిభ కోచింగ్‌ సెంటర్‌ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థగా పేరుగాంచిందన్నారు. దీంతో ఇదే పేరు మీద  కర్నూలు, పత్తికొండలలో  పాఠశాలల, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, డీఈడీ, బీఈడీ కళాశాలలను స్థాపించి విజయవంతంగా నడిపారని, ప్రస్తుతం వాటికి సంబంధించిన ఆస్తులు కోట్లకు చేరాయన్నారు.

ఆ ఆస్తులన్నింటినీ అరుణాచలంరెడ్డి గతేడాది  కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నారని ఆరోపించారు. సొసైటీలో భాగస్వామి అయిన  తన భర్తను  పట్టించుకోకపోగా రూ.80 లక్షలు అప్పులు మోపారన్నారు. దీనిపై ప్రశి్నస్తే కొట్టేందుకు వస్తున్నారని, మీరు  స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. లేకపోతే తమకు  ఆత్మహత్య శరణ్యమవుతుందన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌..   కర్నూలు ఆర్‌డీఓ వెంకటేశ్‌ను విచారణకు ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top