అన్నా.. అందుకే వెళ్లిపోతున్నా...

Women Committed to Suicide in Kurnool Dist  - Sakshi

ఈ ప్రభుత్వానికి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది

ఇక నేను ఎప్పటికీ టీచర్‌ని కాలేను

డీఎస్సీ వాయిదా అని తెలియగానే అన్నకు విజయలక్ష్మి ఫోన్‌ 

ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య 

‘అన్నా.. నేను ఇక టీచర్‌ను కాలేను. ఈ ప్రభుత్వానికి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేనట్లుంది. మళ్లీ నోటిఫికేషన్‌  విడుదలలోనూ జాప్యం జరుగుతుందని పేపర్లు, టీవీల్లో చూశాను. ఇక నేను ఈ ప్రపంచంలో ఉండలేను. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి’ 

   – బుధవారం కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న విజయలక్ష్మి తన అన్నతో చెప్పిన చివరి మాటలివి.. 

టీచర్‌ కావాలన్నది ఆమె కల. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రకటించడంతో.. తన చిరకాల స్వప్నం సాకారం కానుందని సంబరపడింది. మొక్కవోని స్థైర్యంతో రేయింబవళ్లు కష్టపడి చదివింది. ఓ పక్క కోచింగ్‌ కోసం అమ్మ.. అన్న.. భర్త.. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఉద్యోగం సాధించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఆమె చదువును కొనసాగించింది. అయితే ప్రభుత్వం ప్రకటించినట్టుగా నోటిఫికేషన్‌లను విడుదల చేయకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైంది. తిరిగి అక్టోబర్‌ 10న నోటిఫికేషన్‌ వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం.. మళ్లీ మొండిచేయి చూపడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక ఎప్పటికీ తన కల నెరవేరదేమోనన్న ఆందోళనతో అన్నకు ఫోన్‌ చేసి చనిపోతున్నానని చెప్పి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.  

కర్నూలు /దేవనకొండ : కోడుమూరు మండలం వలుకూరుకు చెంది న చంద్రప్ప, లక్ష్మీదేవి కుమార్తె విజయలక్ష్మి. పదో తరగతి వరకు కోడుమూరు జెడ్పీ హెచ్‌ఎస్, ఇంటర్‌ కర్నూలు కేవీఆర్‌లో పూర్తి చేసింది. ఇంకా చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి చేశారు. 2008లో దేవనకొండ మండలం కరివేములకు చెందిన ఆటో డ్రైవర్‌ గిడ్డయ్యతో వివాహం జరిపించారు. వారికి తరుణ్‌తేజ, ప్రహాసిని సంతానం. దేవనకొండ మండలంలో పోస్టుమాస్టర్‌గా పనిచేసే విజయలక్ష్మి తండ్రి చంద్రప్ప గతేడాది గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, అన్న ఓబులేష్‌ శారదానగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. టీచర్‌ కావాలన్నది విజయలక్ష్మి కల. వివాహం చేయడంతో తన కల నెరవేరదేమోనని బెంగపడింది. అయితే.. భర్త సహకారంతో కర్నూలు లక్ష్మీ కళాశాలలో టీటీసీ పూర్తిచేసింది.  

ఏడేళ్ల నుంచి డీఎస్సీ కోచింగ్‌. 
టీటీసీ పూర్తవగానే విజయలక్ష్మి డీఎస్సీ కోచింగ్‌ కోసం కర్నూలులోని తల్లి, అన్న వద్దకు చేరింది. 2011 నుంచే ఓ కోచింగ్‌ సెంటర్‌లో టెట్, డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంది. 2012లో జరిగిన టెట్‌ కమ్‌ టీఆర్‌టీలో తక్కువ మార్కులు రావడంతో మళ్లీ గట్టిగా పోరాడాలని నిర్ణయం తీసుకుంది. 2014లో డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చినా అప్పుడు పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. వచ్చే డీఎస్సీలో కచ్చితంగా ఉద్యోగం సాధించాలని 2014 నుంచి రేయింబవళ్లు చదివేది. 2017 డిసెంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎంతో సంతోషపడింది. 

అయితే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్‌ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రూ.15 వేలు ఖర్చు చేసి డీఎస్సీ కోచింగ్‌ కూడా తీసుకుంది. అయితే.. నోటిఫికేషన్‌ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేసింది. ముచ్చటగా మూడోసారి అక్టోబర్‌ 10న నోటిఫికేషన్‌ వస్తుందని చెప్పిన ప్రభుత్వం.. దానిని విడుదల చేయకపోవడంతో విజయలక్ష్మి తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక నోటిఫికేషన్‌ రాదేమోనని భయపడింది. అమ్మ, అన్న, భర్త తన కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టారని.. వారందరికీ ఏం చెప్పుకోవాలని తలచి చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.  

నోటిఫికేషన్‌ రాదేమోనన్నబెంగతో ప్రాణాలు తీసుకుంది 
నా భార్యకు చాలా ఆత్మవిశ్వాసం. లక్షల మందిలో మనకు ఉద్యోగం ఎలా వస్తుందని నేను ప్రశ్నిస్తే.. చదివితే ఎవరికైనా వస్తుందనేది. రేయింబవళ్లు కష్టపడేది. అక్టోబర్‌ 10వ తేదీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మళ్లీ ఇవ్వకపోవడంతో తాను టీచర్‌ కాలేనేమోనని భయపడిపోయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులం అందరం ధైర్యం చెప్పాం. అయినా ఇక నోటిఫికేషన్‌ రాదేమోనని మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది.  
–  గిడ్డయ్య, విజయలక్ష్మి భర్త 
 
ప్రభుత్వం నాటకాలాడుతోంది.. 
డీఎస్సీ నోటిఫికేషన్‌ పేరుతో ప్రభు త్వం నాటకాలాడుతోంది. పేపర్లు, టీవీల్లో ప్రకటనలతో సరిపెడుతోంది. టీచర్, విద్యార్థి నిష్పత్తి అంటూనే ఉద్యోగాల్లో కోత పెడుతోంది. డీఎస్సీ, టెట్‌ కోసం చదివిన నిరుద్యోగులు ప్రభుత్వ నిర్వాకంతో అసహనానికి లోనవుతున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 
– రామశేషయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top