నా స్థలంలో అన్న క్యాంటీన్‌ ఎలా పెడతారు?

Woman committed suicide by protesting on the government - Sakshi

     పెద్దాపురం పట్టణంలో ఇంకెక్కడా స్థలం లేదా?

     ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహిళ ఆత్మహత్యాయత్నం

పెద్దాపురం: ప్రైవేట్‌ స్థలంలో ‘అన్న క్యాంటీన్‌’ ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులను ఓ మహిళ నిలదీసింది. పట్టణంలో ఇంకెక్కడ స్థలం లేదా అని ప్రశ్నించింది. పేదల స్థలమే కావాల్సి వచ్చిందా అని బోరున విలపించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆమె స్థలంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగింది. పట్టణానికి చెందిన జాలా కన్య మరియ, జాలా పుష్పల తండ్రికి ప్రభుత్వం 1983లో స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో రెండున్నర సెంట్లు ఇచ్చింది. అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్‌ అధికారులు ఆదివారం ఆ స్థలం వద్దకు వచ్చారు. దీంతో మరియ అధికారులను అడ్డుకుంది. అయినా కూడా వారు వినకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇంతలో స్థానికులు, ఆమెను అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్‌ఐ కృష్ణ భగవాన్‌ ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకపోతే.. ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని అధికారులు చెప్పారు. అందుకే ఆ స్థలంలో క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కాగా, రోడ్డు విస్తరణ వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైందని బాధితురాలు చెప్పింది. విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకుందామనుకుంటే.. ప్రభుత్వమిలా క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితురాలి సోదరి కరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు, టీపీవో భాస్కరరావులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top